దసరా, దీపావళి పండగుల సమయంలో ఏం చేద్దామనుకుంటున్నారు..? కుటుంబ సమేతంగా ట్రిప్ వేద్దామని అనుకుంటున్నారా..? ప్రముఖ ట్రావెల్ సెర్చ్ ఇంజన్ ‘కాయక్’ పోర్టల్ డేటాను గమనిస్తే అసలు విషయం తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ పోర్టల్‌పై విదేశీ పర్యాటక ప్రాంతాలు, వాటికి ఫ్లయిట్ సర్వీసుల సమాచారాన్ని అన్వేషిస్తున్న వారి సంఖ్య 118 శాతం పెరిగింది. 2019 పండుగల సమయంతో పోలిస్తే రెట్టింపైనట్టు ‘కాయక్’ ఓ నివేదికను విడుదల చేసింది. ఇదే కాలంలో విమాన టికెట్ల ధరలు 62 శాతం పెరిగినా కానీ, పర్యటనలకు వెనుకాడడం లేదని తెలుస్తోంది.
వరుసగా రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి కారణంగా దేశ, విదేశీ పర్యటనలకు ఎక్కువ మంది దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఈ విడత పండుగల సెలవుల్లో ఎలా అయినా సరే ఏదైనా ప్రాంతాన్ని చూసి రావాల్సిందేనన్న ధోరణి బలపడుతోంది. ఈ పండుగల సీజన్‌లో ఎక్కువ మంది గోవా వెళ్లి రావాలని భావిస్తున్నారు. గోవాలోని పర్యాటక ప్రాంతాల గురించి ఎక్కువ మంది కాయక్‌పై శోధిస్తున్నారు. విమాన టికెట్ల చార్జీలు ఎంతున్నదీ తెలుసుకుంటున్నారు.
దుబాయ్, బ్యాంకాక్, లండన్ ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్న అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ, ఖతార్, న్యూజిలాండ్, సింగపూర్, సౌదీ అరేబియా నుంచి ఎక్కువ మంది భారత్‌కు రావాలని అనుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీ, ముంబై, చెన్నై, కోచి, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2019తో పోలిస్తే రిటర్న్ టికెట్ ధర 31 శాతం మేర వీరికి పెరిగింది.
కాయక్ డేటా..
► భారత ఎయిర్‌పోర్ట్‌ల నుంచి విమాన సర్వీసుల సమాచారాన్ని శోధిస్తున్న వారి సంఖ్యలో 118 శాతం వృద్ధి (2019తో పోలిస్తే) ఉంది. అంతర్జాతీయ విమాన సర్వీసుల గురించి అన్వేషించే వారిలో 143 శాతం వృద్ధి ఉంటే, దేశీ విమాన సర్వీసుల గురించి చూసే వారు 91 శాతం పెరిగారు.
► 2019తో పోలిస్తే అంతర్జాతీయ విమాన సేవల చార్జీలు 38 శాతం పెరిగాయి. దేశీయ విమాన సేవల చార్జీలు 39 శాతం పెరిగాయి. అయినా కానీ, మార్పు కోసం ఏదో ఒక ప్రాంతాన్ని చూసి రావాలనుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలు తొలగిపోవడం సానుకూలిస్తోంది.
► కేవలం విమానాల కోసమే కాదు, హోటళ్ల సమాచారం తెలుసుకుంటున్న వారిలోనూ 2019తో పోలిస్తే వృద్ధి ఉన్నట్టు కాయక్ డేటా చెప్తోంది. 2019తో పోలిస్తే హోటళ్ల సమాచారాన్ని కోరుతున్న వారిలో 34 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక దేశీ హోటళ్ల గురించి శోధనలో 98 శాతం వృద్ధి ఉంది.
► అంతర్జాతీయంగా హోటళ్ల ధరలను 2019తో పోల్చి చూస్తే.. 3–4 స్టార్ హోటల్‌లో డబుల్ రూమ్‌కు ఒక రాత్రి విడిది కోసం చెల్లించే చార్జీ 22 శాతం పెరిగింది. దేశీయ హోటళ్లలో ఇదే చార్జీ 25 శాతం పెరిగింది.
► విదేశీ పర్యటన కాలం 2019తో పోలిస్తే 13 శాతం తగ్గింది. సగటున 24 రోజులకు భారతీయులు ప్లాన్ చేసుకుంటున్నారు. దేశీ పర్యటనలకు వస్తే 2019తో పోల్చి చూస్తే ఒక రోజు పెరిగి ఆరు రోజులుగా ఉంది.
చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా!
Comments
Please login to add a commentAdd a comment