ఇంధన మంట షురూ! | Petrol, Diesel Prices Soar: India Faces Fuel Hike Due To Middle East Tensions | Sakshi
Sakshi News home page

ఇంధన మంట షురూ!

May 9 2026 8:54 AM | Updated on May 9 2026 11:07 AM

Petrol, Diesel Prices Soar: India Faces Fuel Hike Due To Middle East Tensions

పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

కొంతకాలంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇకపై పెరిగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్‌ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల కారణంగా ముడి చమురు ధర ఇటీవల బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 110 డాలర్లకుపైగా పెరిగింది. ఈ నేపథ్యంలో మే 15 లోపు చమురు కంపెనీలు ధరల పెంపునకు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రపంచం అతలాకుతలం.. భారత్ పరిస్థితి ఏంటి?

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన హార్మూజ్‌ జలసంధిలో వారాల తరబడి నెలకొన్న అంతరాయం గ్లోబల్ ఎనర్జీ షాక్‌కు దారితీసింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ ఇంధన రేషనింగ్‌ను ప్రవేశపెట్టగా, శ్రీలంక, పాకిస్థాన్ పనిదినాలను తగ్గించి ఇంధనాన్ని ఆదా చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దక్షిణ కొరియా దశాబ్దాల తర్వాత ధరలపై పరిమితులు విధించింది. అయితే, భారత్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడా కొరత లేకుండా పరిస్థితిని అదుపు చేయగలిగింది.

చమురు కంపెనీల నష్టాలు

ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ధరలు పెరగకపోవడంతో ఇవి నెలకు సుమారు రూ.30,000 కోట్ల మేర నష్టాన్ని భరిస్తున్నాయి. ముడి చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు ప్రభుత్వం, ఈ సంస్థలు కలిసి పెట్రోల్‌పై రూ.24, డీజిల్‌పై రూ.30 భారాన్ని వినియోగదారులపై పడకుండా తామే భరించాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ అంతర్జాతీయ ఒత్తిడి దృష్ట్యా ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది.

 

 

సంక్షోభాన్ని తట్టుకొని..

ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ ఇంధన భద్రతను కాపాడుకోగలగడానికి కారణం ప్రభుత్వ వ్యూహాత్మక చర్యలే.

  • దేశీయగా ఎల్‌పీజీ ఉత్పత్తిని రోజుకు 36,000 టన్నుల నుంచి 54,000 టన్నులకు యుద్ధ ప్రాతిపదికన పెంచారు.

  • రష్యా, యూఎస్, పశ్చిమ ఆఫ్రికా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచి సరఫరాను స్థిరీకరించారు. ముడి చమురు సోర్సింగ్‌(మన దేశానికి ఎగుమతులు చేసేవి) దేశాల సంఖ్య 27 నుంచి 40కి పెరిగింది.

  • గత దశాబ్ద కాలంలో ఎల్‌పీజీ టెర్మినల్స్ రెట్టింపు అవ్వడం, ఇథనాల్ మిశ్రమం 1.5% నుంచి 20%కి పెరగడం భారత్‌కు రక్షణ కవచంగా నిలిచింది.

  • దేశీయ రిఫైనరీలు ప్రస్తుతం 100% మించిన సామర్థ్యంతో పనిచేస్తూ నిరంతరాయంగా ఇంధనాన్ని అందిస్తున్నాయి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అయితే చమురు కంపెనీల ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా ఉండాలంటే రాబోయే వారం రోజుల్లో ధరల సర్దుబాటు తప్పకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప చమురు సెగ తగ్గేలా లేదు.

ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు

Advertisement
 
Advertisement
Advertisement