ఐఎంసీ 2024లో ప్రధాని మోదీ
కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ఆకాష్ అంబానీ
మొబైల్ తయారీ రంగంలో భారత్ వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. గతంలో కేవలం రెండు మొబైల్ తయారీ యూనిట్లను కలిగి ఉన్న ఇండియా ప్రస్తుతం వీటి సంఖ్యను 200కు పైగా విస్తరించిందని చెప్పారు. టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో వస్తోన్న మార్పులను గమనిస్తూ ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలని ప్రధాని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2024 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘భారత్ ఒకప్పుడు వివిధ దేశాల నుంచి మొబైళ్లను భారీగా దిగుమతి చేసుకునేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రపంచానికి అవసరమయ్యే ఫోన్లను భారత్ ఎగుమతి చేస్తోంది. గతంలో కంటే దేశీయంగా ఆరు రెట్లు ఎక్కువ మొబైల్ ఫోన్‌లను ఉత్పత్తి చేస్తున్నాం. డిజిటల్ సాంకేతికతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో వచ్చే ఆవిష్కరణలకు భారత్ నాయకత్వం వహించాలి. దేశంలో టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేగంగా వృద్ధి చెందుతుంది. స్థానికంగా రెండేళ్ల క్రితమే 5జీ సేవలు ప్రారంభించాం. కానీ అది ఎంతో వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని దాదాపు ప్రతి జిల్లాలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో అతిపెద్ద 5జీ మార్కెట్‌గా మారింది. ప్రతి భారతీయడు నెలలో దాదాపు 30 జీబీ డేటాను వినియోగిస్తున్నాడు. ఇంటర్‌నెట్ అవసరాలు, డిజిటల్ లావాదేవీలు పెరగడం ఇందుకు ఒక కారణంగా ఉంది. దేశీయంగా యూపీఐ, ఓఎన్‌డీసీ వంటి పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ఆదరణ పెరుగుతోంది. అయితే పెరుగుతున్న టెక్నాలజీని మాత్రం అందరూ మంచి కోసమే వాడుకోవాలి’ అని చెప్పారు.
ఇదీ చదవండి: గూగుల్ న్యూక్లియర్ పవర్ కొనుగోలు
కార్యక్రమంలో జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ..‘ప్రభుత్వ యంత్రాంగం సాయంతో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రపంచ స్థాయికి చేరింది. ఇది డిజిటల్ ఆవిష్కరణలు, సంస్థల మధ్య సహకారానికి వేదికగా నిలిచింది. ప్రస్తుతం దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలు దూసుకుపోతున్నాయి. ప్రపంచంలో డిజిటల్ సూపర్ పవర్‌గా ఇండియా ఎదుగుతోంది. రాబోయే రోజుల్లో 6జీతో మరింత మెరుగైన సేవలందించనున్నాం. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ స్వీకరణలో గతంలో 155వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం అతిపెద్ద డేటా మార్కెట్‌గా ఎదిగింది. గ్లోబల్‌గా మూడో అతిపెద్ద యునికార్న్ హబ్‌గా మారింది. ప్రపంచంలోనే నం.1 యూపీఐ డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా నిలిచింది. ఈ అభివృద్ధిలో జియో భాగమైనందుకు సంతోషంగా ఉంది. భారత్ వృద్ధి చెందేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. 2047 నాటికి వికసిత్ భారత్ కలను సాకారం చేసుకోవడానికి ఏఐ కీలకంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ఈమేరకు సమగ్ర ఏఐ సేవలందించే సంస్థలను ప్రోత్సాహించాలి. ప్రభుత్వం డేటా సెంటర్ పాలసీ 2020 ముసాయిదాను అమలు చేసేలా చర్యలు చేపట్టాలి. ఏఐ ఆధారిత మెషీన్ లెర్నింగ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్న భారతీయ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించాలి’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment