Indian mobile market
-
‘ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలి’
మొబైల్ తయారీ రంగంలో భారత్ వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. గతంలో కేవలం రెండు మొబైల్ తయారీ యూనిట్లను కలిగి ఉన్న ఇండియా ప్రస్తుతం వీటి సంఖ్యను 200కు పైగా విస్తరించిందని చెప్పారు. టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో వస్తోన్న మార్పులను గమనిస్తూ ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలని ప్రధాని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2024 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘భారత్ ఒకప్పుడు వివిధ దేశాల నుంచి మొబైళ్లను భారీగా దిగుమతి చేసుకునేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రపంచానికి అవసరమయ్యే ఫోన్లను భారత్ ఎగుమతి చేస్తోంది. గతంలో కంటే దేశీయంగా ఆరు రెట్లు ఎక్కువ మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాం. డిజిటల్ సాంకేతికతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో వచ్చే ఆవిష్కరణలకు భారత్ నాయకత్వం వహించాలి. దేశంలో టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా వృద్ధి చెందుతుంది. స్థానికంగా రెండేళ్ల క్రితమే 5జీ సేవలు ప్రారంభించాం. కానీ అది ఎంతో వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని దాదాపు ప్రతి జిల్లాలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో అతిపెద్ద 5జీ మార్కెట్‌గా మారింది. ప్రతి భారతీయడు నెలలో దాదాపు 30 జీబీ డేటాను వినియోగిస్తున్నాడు. ఇంటర్నెట్ అవసరాలు, డిజిటల్ లావాదేవీలు పెరగడం ఇందుకు ఒక కారణంగా ఉంది. దేశీయంగా యూపీఐ, ఓఎన్డీసీ వంటి పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ఆదరణ పెరుగుతోంది. అయితే పెరుగుతున్న టెక్నాలజీని మాత్రం అందరూ మంచి కోసమే వాడుకోవాలి’ అని చెప్పారు.ఇదీ చదవండి: గూగుల్ న్యూక్లియర్ పవర్ కొనుగోలుకార్యక్రమంలో జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ..‘ప్రభుత్వ యంత్రాంగం సాయంతో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రపంచ స్థాయికి చేరింది. ఇది డిజిటల్ ఆవిష్కరణలు, సంస్థల మధ్య సహకారానికి వేదికగా నిలిచింది. ప్రస్తుతం దేశంలో 5జీ నెట్వర్క్ సేవలు దూసుకుపోతున్నాయి. ప్రపంచంలో డిజిటల్ సూపర్ పవర్‌గా ఇండియా ఎదుగుతోంది. రాబోయే రోజుల్లో 6జీతో మరింత మెరుగైన సేవలందించనున్నాం. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ స్వీకరణలో గతంలో 155వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం అతిపెద్ద డేటా మార్కెట్‌గా ఎదిగింది. గ్లోబల్‌గా మూడో అతిపెద్ద యునికార్న్ హబ్‌గా మారింది. ప్రపంచంలోనే నం.1 యూపీఐ డిజిటల్ చెల్లింపు వ్యవస్థగా నిలిచింది. ఈ అభివృద్ధిలో జియో భాగమైనందుకు సంతోషంగా ఉంది. భారత్ వృద్ధి చెందేందుకు ప్రస్తుత ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. 2047 నాటికి వికసిత్ భారత్ కలను సాకారం చేసుకోవడానికి ఏఐ కీలకంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ఈమేరకు సమగ్ర ఏఐ సేవలందించే సంస్థలను ప్రోత్సాహించాలి. ప్రభుత్వం డేటా సెంటర్ పాలసీ 2020 ముసాయిదాను అమలు చేసేలా చర్యలు చేపట్టాలి. ఏఐ ఆధారిత మెషీన్ లెర్నింగ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్న భారతీయ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించాలి’ అన్నారు. -
6జీ టెక్నాలజీపై నోకియా డెమో.. అదిరిపోయే ఫీచర్లు
న్యూదిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023లో కంపెనీలు 5జీ, 6జీ టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా నోకియా 6జీటెక్నాలజీకు సంబంధించి డెమో ఇచ్చింది. కంపెనీ వార్షిక టెలికాం టెక్నాలజీ ఫోరమ్‌లో 6జీ కనెక్టివిటీ, ర్యాపిడ్ రైల్ ఎన్సీఆర్టీసీ, ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్, చంద్రునిపై 4జీ/LTE నెట్వర్క్ వంటి సెన్సింగ్ టెక్నాలజీలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్), బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ పై ఆధారపడే మెటావర్స్ ఇంటెలిజెంట్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ సాంకేతికతలపై డెమో ప్రదర్శించింది. నోకియా ప్రదర్శించిన 6జీ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు వారి పరిసరాల గురించి, అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సెన్సింగ్ టెక్నాలజీ వినియోగదారుల గోప్యతను కాపాడుతుందని, రాడార్ లాగా పనిచేస్తుందని, వ్యక్తులు, వస్తువులు వాటి కదలికలను పసిగట్టగలదని నోకియా చెబుతుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) దిల్లీ నుంచి మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసం ఒక ప్రైవేట్ వైర్లెస్ నెట్‌వర్క్‌ను కూడా ప్రదర్శించింది. దీన్ని ఫ్రెంచ్ సంస్థ అయిన అల్స్టోమ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎల్టీఈ/ 4.9జీ ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్. నాసా ప్రోత్సాహంతో చంద్రునిపై మొట్టమొదటి సెల్యులార్ 4జీ/ఎల్టీఈ నెట్వర్క్ని ఆవిష్కరించేందుకు నోకియా బెల్ ల్యాబ్స్ ఇంటూటివ్ మెషీన్స్, లూనార్ అవుట్‌పోస్ట్‌తో జతకట్టింది. భూమిపై ఉన్న స్మార్ట్ఫోన్లను కనెక్ట్ చేయడానికి ఉపయోగించే అదే సెల్యులార్ సాంకేతికతను భవిష్యత్తులో చంద్రుడితో అనుసంధానం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
మన టెక్నాలజీ వైపు.. ప్రపంచం చూపు..
న్యూఢిల్లీ: వివిధ రంగాలకు సంబంధించి చౌకైన, మెరుగైన టెక్నాలజీ పరిష్కార మార్గాల కోసం యావత్ ప్రపంచం భారత్ వైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చేందుకు ఉపయోగపడే ఆవిష్కరణలను రూపొందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘5జీ టెక్నాలజీ నుంచి కృత్రిమ మేథ, వర్చువల్ రియాలిటీ, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ వరకూ.. ఇలా అనేక అంశాల్లో చౌకైన, సుస్థిరమైన టెక్నాలజీ ఆధారిత పరిష్కార మార్గాలను కనుగొనగలదని భారత్ వైపు ప్రపంచం ఆశాభావంతో చూస్తోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. భారత డిజిటల్ సామర్థ్యాలు అసమానమైనవని, దేశ డిజిటల్ వ్యవస్థ అత్యంత భారీ స్థాయిదని ఆయన చెప్పారు. టెక్నాలజీ వేగంగా మారిపోతున్న పరిస్థితుల్లో .. వైద్యం, విద్య, వ్యవసాయం, చిన్న..మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) వంటి రంగాలను మెరుగుపర్చేందుకు మన ఆవిష్కరణలు, ప్రయత్నాలు ఎంత మేర ప్రభావం చూపగలవన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. బుధవారం ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సు (ఐఎంసీ) ప్రారంభం సందర్భంగా ప్రధాని ఈ మేరకు తన సందేశాన్ని పంపారు. మరోవైపు, టెలికం రంగంలో మరిన్ని సంస్కరణలు అమలు చేసేందుకు, నియంత్రణ వ్యవస్థను ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దేందుకు తీసుకోతగిన చర్యలపై పరిశ్రమ వర్గాలు తగు సలహాలు, సూచనలు చేయాలని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సూచించారు. సమ్మిళిత వృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని, అట్టడుగు వర్గాలకు కూడా డిజిటల్ కనెక్టివిటీ ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చేందుకు అమలు చేయతగిన ప్రణాళికలను కేంద్రం దృష్టికి తీసుకురావాలని కోరారు. స్మార్ట్ఫోన్లపై సబ్సిడీకి యూఎస్‌వో నిధులు ఇవ్వాలి: ముకేశ్ అంబానీ దేశీయంగా డిజిటల్ విప్లవం మరింత ఊపందుకునేలా నిర్దిష్ట వర్గాలకు సబ్సిడీపై స్మార్ట్ఫోన్లను అందించేందుకు యూఎస్‌వో ఫండ్ నిధులను వినియోగించాలని టెలికం దిగ్గజం రిలయన్స్ జియో అధినేత ముకేశ్ అంబానీ సూచించారు. 5జీ సేవల విస్తరణను జాతీయ ప్రాధాన్యతాంశంగా పరిగణించాలని ఐఎంసీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల వారికి టెలికం సేవలు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ (యూఎస్‌వో) ఫండ్ ఏర్పాటైంది. టెల్కోలు ప్రభుత్వానికి కట్టే లైసెన్సు ఫీజులో సుమారు 5% మొత్తం ఈ నిధిలోకి వెడుతుంది. ఈ నేపథ్యంలో అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లిటిగేషన్లు తగ్గాలి: ఎయిర్టెల్ మిట్టల్ భారీ స్థాయి లిటిగేషన్లు.. టెలికం రంగానికి సమస్యగా మారాయని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. వీటి పరిష్కారంతో పాటు కొత్త వివాదాలు తలెత్తకుండా నియంత్రణ విధానాలు సరళతరంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పోటీ సంస్థలు కలిసి పనిచేయడం, సుంకాలు.. స్పెక్ట్రం ధర తగ్గింపు తదితర అంశాలు టెలికం రంగం పూర్తి సామర్థ్యాలతో పనిచేసేందుకు దోహదపడగలవని మిట్టల్ చెప్పారు. ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి సారించాలని కోరారు. బ్యాంకింగ్ మద్దతు ఉండాలి: బిర్లా టెలికం రంగానికి ఊతం ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే విధానాలపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవడంతో పాటు బ్యాంకింగ్ రంగం నుంచి కూడా మద్దతు లభిస్తే టెలికం రంగం గణనీయంగా కోలుకోగలదని ఆయన చెప్పారు. అంతర్జాతీయ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో భారత్ ముందుండేందుకు ఇవి తోడ్పడగలవని తెలిపారు. -
‘మాన్సూన్ హంగామా’తో మరింత కిక్
జియో ఫోన్ మరో ప్రత్యేకతను సంతరించుకుంది. 2018 సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 27% మార్కెట్ వాటాను జియో ఫోన్ కైవసం చేసుకుందని సైబర్ మీడియా రీసెర్చ్ చేసిన అధ్యయనం వెల్లడించింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లోని ఫ్యూజన్ సెగ్మెంట్లో జియో ఫోన్ చరిత్ర సృష్టించిందని ఈ నివేదిక విశ్లేషించింది. 4జీ కనెక్టివిటీ కలిగి ఉండి వినియోగదారులకు నచ్చే యాప్‌లను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉందని వివరించింది. 2018 రెండో త్రైమాసికంలో స్వల్పకాలంలో మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిన రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని సైబర్ మీడియా రీసెర్చ్ తెలిపింది. ``అందులో ఒకటి జియో ప్రవేశపెట్టిన సంచలన మాన్సూన్ ఆఫర్. ఈ ఆఫర్ వల్ల అన్ని ప్రముఖ హ్యాండ్సెట్ల బ్రాండ్లకు అనియతమైన డిమాండ్ ఏర్పడింది. రెండో అంశం చిన్న తరహా విభాగానికి చెందిన వారు సీకేడీ మాన్యూఫాక్చరింగ్ వైపు దృష్టి సారించారు. దీంతోపాటుగా వారి సొంత ఎస్ఎంటీ లైన్ల ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగించారు`` అని సీఎంఆర్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ (ఐఐజీ) హెడ్ ప్రభురామ్ తెలిపారు. ఫీచర్ ఫోన్లు మరియు ఫ్యూజన్ ఫోన్లు కలిపి 2020 నాటికి స్మార్ట్ ఫోన్లను దాటివేస్తాయని సైబర్ మీడియా రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. జియో ప్రకటించిన ఎక్సేంజ్ స్కీమ్`జియో ఫోన్ మాన్సూన్ హంగామా`కు తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభించిందని నివేదిక తెలిపింది. ఈ ఆఫర్‌తో విపణిలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోవడమే కాకుండా.. జియో ఫోన్ అమ్మకాలలో విశేష వృద్ధి స్పష్టంగా కనిపించిందని పేర్కొంది. ఈ పథకం ప్రవేశపెట్టిన కేవలం పదిరోజుల వ్యవధిలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది జియోఫోన్ల అమ్మకాలు జరిగాయని చెప్పింది. జియోఫోన్ మాన్సూన్ హంగామా ఆఫర్లో భాగంగా వినియోగదారులు ఏదైనా ఫీచర్ ఫోన్ (ఏ బ్రాండ్ కు చెందినది అయినా) ఎక్సేంజ్ చేసి కొత్త జియోఫోన్ ( ప్రస్తుతం ఉన్న మోడల్)ను కేవలం రూ.501 సెక్యురిటీ డిపాజిట్ రుసుముతో పొందవచ్చు. వాస్తవ సెక్యురిటీ డిపాజిటల్ రూ.1500 కాగా, ఈ ఆఫర్లో రూ. 999 తగ్గింపు కావడం విశేషం. ఫీచర్ ఫోన్‌ను అందించే ఈ పథకంలో భాగంగా వినియోగదారులు రూ. 594(రూ.99 x 6) చెల్లించడం ద్వారా 6 నెలల పాటు అన్లిమిటెడ్ వాయిస్, డేటాను పొందవచ్చు. అంటే వినియోగదారుడు రూ. 1,095 (రూ.501 తిరిగి చెల్లించే సెక్యురిటీ మొత్తం+ రూ.594 రీచార్జీ మొత్తం) చెల్లించడం ద్వారా ఆరునెలల పాటు అన్లిమిటెడ్ కాల్స్, డేటా అందించే జియో ఫోన్‌ను తమ పాత ఫోన్‌ను ఎక్సేంజ్‌లో సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలానికే వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. -
భారత్‌లో మరో చైనా స్మార్ట్‌ఫోన్
వన్‌ప్లస్ నుంచి వన్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.21,999 న్యూఢిల్లీ: భారత మొబైల్ మార్కెట్లోకి మరో చైనా కంపెనీ ప్రవేశించింది. చైనాకు చెందిన వన్‌ప్లస్ కంపెనీ మంగళవారం వన్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ ధర రూ.21,999. ఈ ఫోన్‌ను ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌డాట్‌ఇన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ చెప్పారు. ఈ వన్ మొబైల్ ఫోన్లో 2.5 గిగాహెర్ట్స్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 5.5 అంగుళాల డిస్ప్లే, 3 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ,13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా,5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ ఆధారిత సైనోజెన్‌మోడ్ 11ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుందని వివరించారు. అతిపెద్ద మార్కెట్‌గా భారత్... ప్రస్తుతం తమకు అతి పెద్ద మార్కెట్ చైనా అని, కానీ భవిష్యత్తులో ఈ స్థానానికి చైనాను తోసిరాజని భారత్ దూసుకువస్తుందని వికాస్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ వరకూ ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల డివైస్‌లను విక్రయించామని చెప్పారు. రానున్న నెలల్లో బెంగళూరులో ఒక ఇంజినీరింగ్ టీమ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటీవలే చైనాకు చెందిన షియోమి, ఒప్పొ, జొల్లా కంపెనీలు తమ స్మార్ట్ఫోన్లను భారత్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.