న్యూఢిల్లీ: ప్రయాణ బీమా (ట్రావెల్ ఇన్సూరెన్స్)కు పూర్వపు వైభవం సంతరించుకుంది. దేశీయ ప్రయాణాలపై ఆంక్షలు తొలగిపోవడానికి తోడు, అంతర్జాతీయ విమాన సర్వీసులను తెరవడం ఇందుకు అనుకూలించే అంశం. కరోనా వైరస్ సమసిపోవడంతో మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించడం తెలిసిందే. దీంతో ఎక్కువ మంది అంతర్జాతీయ ప్రయాణికులు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు.
ఆశ్చర్యకరం ఏమిటంటే కరోనా ముందు నాటితో పోలిస్తే ఇప్పుడు మరింత మంది ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు మొగ్గుచూపిస్తున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని వారి వైఖరిలో మార్పువచ్చినట్టు భావించొచ్చు. కరోనా వల్ల రెండేళ్లుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడం గమనార్హం. దీంతో విదేశీ పర్యటనలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం ట్రావెల్ ఇన్సూరెన్స్ విభాగాన్ని గట్టిగానే తాకింది.
25% అధికం: ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్ పాలసీబజార్ మార్చి 27తో మొదలైన వారంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోళ్లు 25% పెరిగినట్టు (అంతకుముందు వారంతో పోలిస్తే) తెలిపింది. విక్రయాలు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని ఈ సంస్థ అంటోంది. విమాన టికెట్ ధరల స్థిరీకరణకు తోడు, సెలవులు పరిశ్రమకు కలిసొస్తాయని పేర్కొంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ 35 శాతానికి చేరుకుంటాయని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ అంచనా వేస్తోంది.
కరోనా మహమ్మారి రావడానికి ముందు ఇది 18%గా ఉండేది. విహార యాత్రలు, వ్యాపార యాత్రలకు వెళ్లే వారి నుంచి ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు డిమాండ్ పెరిగినట్టు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అంటోంది. చాలా కాలంగా విమాన సర్వీసులు నిలిచిపోయినందున విహార యాత్రలకు డిమాండ్ ఏర్పడినట్టు తెలిపింది. విదేశీ పర్యటనలకు సంబంధించి ట్రావెల్ ఇన్సూరెన్స్ బుకింగ్‌లు ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో 40 శాతం పెరిగినట్టు పాలసీబజార్ వెల్లడించింది.
డిమాండ్ మరింత పెరుగుతుంది..
‘‘ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ 1.5 రెట్లు వృద్ధిని చూస్తుంది’’అని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ వెబ్‌సేల్స్ హెడ్ సౌరభ్ చటర్జీ చెప్పారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. విమాన సర్వీసు రద్దయినా, ఆలస్యం అయినా, ఆరోగ్య సమస్యలు ఏర్పడినా కవరేజీ లభిస్తుందని పాలసీబజార్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అమిత్ చాబ్రా తెలిపారు. ‘‘విదేశాలు ఇప్పుడే పర్యాటకులను అనుమతిస్తున్నాయి. ప్రయాణానికి ముందే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలి. అప్పుడు రిస్క్‌ను ఎదుర్కోవడం సులభంగా ఉంటుంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment