దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల అట్రిషన్(ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం)రేటు తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా 31-51 శాతం పెరిగిన ఈ రేటు 2024 ఆర్థిక సంవత్సరంలో తగ్గినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్‌లో ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకుల్లో నియామకాలు పెరగడం, తమ కెరియర్ కోసం యువత ఎక్కువగా బ్యాంకింగ్ రంగాన్ని ఎంచుకోవడం ఇందుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కొవిడ్ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ నెమ్మదిగా నష్టాల్లోకి జారుకుంది. లాక్‌డౌన్ కారణంగా లోన్లు ఇవ్వడం ఆగిపోయింది. ఆ సమయంలో నెలవారీ ఈఎంఐలు చెల్లించేందుకు ఆర్థికశాఖ గడువు ఇచ్చింది. ఫలితంగా బ్యాంకింగ్ నిర్వహణ భారంగా మారింది. దాంతో చాలామంది ఉద్యోగులు ఇతర సంస్థల్లో చేరడం, ఉద్యోగాలు మానడం వంటివి జరిగాయి. గత మూడు త్రైమాసికాల నుంచి బ్యాంకులు మెరుగైన పలితాలు విడుదల చేస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో 2023 ఆర్థిక సంవత్సరంలో అట్రిషన్ రేటు 31-51 శాతంగా ఉంది. 2023లో ఎంప్లాయి టర్నోవర్ రేటు(ఉద్యోగుల ద్వారా వచ్చే ఆదాయం) 25-45%గా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ , బంధన్ బ్యాంక్ , ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్‌లు కలిసి మార్చి చివరి నాటికి సుమారు 7,30,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం వరకు ఉద్యోగుల అట్రిషన్ రేటు గతంలో కంటే 4.5-14 శాతం పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 2023లో 34.2 శాతంగా ఉన్న అట్రిషన్ రేటు 2024లో 26.9%కి చేరింది. ఐసీఐసీఐ బ్యాంకులో 2023లో 30.9% నుంచి 2024లో 24.5%కు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో 2023లో 45.9% నుంచి 2024లో 39.6%కి పడిపోయింది.
ఇదీ చదవండి: సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్ నిలిపివేత!
గత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో బ్యాంకులు తమ శాఖల విస్తరణకు పూనుకున్నాయి. దాంతో నియామకాలపై దృష్టి సారించాయి. లోన్ల జారీ క్రమంగా పెరుగుతోంది. యువత తమ కెరియర్ అభివృద్ధికి బ్యాంకింగ్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. దాంతో టాప్ బ్యాంకుల్లో చేరుతున్న ఉద్యోగులు సంస్థలు మారడం లేదని, క్రమంగా అట్రిషన్‌రేటు తగ్గుతుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment