Putin Double Game: Only Ruble No More Cryptocurrency Says Putin - Sakshi
Sakshi News home page

రష్యా ఊగిసలాట.. పుతిన్‌ డబుల్‌ గేమ్‌? వాళ్లను నిండా ముంచడమే లక్ష్యంగా..!

Published Fri, Jun 10 2022 6:49 PM | Last Updated on Fri, Jun 10 2022 7:38 PM

Putin Double Game: Only Ruble No More Cryptocurrency Says Putin - Sakshi

రష్యా మరోసారి తన ఊగిసలాటను ప్రపంచానికి ప్రదర్శిస్తోంది. యుద్ధంతో కాదు.. ఈసారి క్రిప్టోకరెన్సీ చట్టబద్ధత విషయంలో!.  ముఖ్యంగా ఉక్రెయిన్‌ యద్ధం మొదలైనప్పటి నుంచి క్రిప్టోకరెన్సీ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ డబుల్‌ గేమ్‌ నడిపిస్తున్నారు. ఇదంతా పాశ్చాత్య దేశాల క్రిప్టో ఇన్వెస్టర్లను ముంచడానికే అనే వాదన బలంగా వినిపిస్తోంది ఇప్పుడు.

అధ్యక్షుడు పుతిన్‌ జోక్యం చేసుకున్నా.. గత కొన్ని నెలలుగా బ్యాంకర్లు, రాజకీయ నాయకులు, అధికారులు అంతా కలిసి మల్లాగుల్లాలు పడుతున్నా క్రిప్టోకరెన్సీ విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. తాజాగా క్రిప్టో ఇన్వెస్టర్లకు పెద్ద షాక్‌ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. క్రిప్టోకరెన్సీలో చెల్లింపులు రష్యాలో చెల్లవంటూ కీలక నిర్ణయం తీసుకుంది రష్యా. ఈ మేరకు.. రష్యా పార్లమెంట్‌ దిగువ సభలో ఓ ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చింది. జూన్‌ 7వ తేదీన ఈ చట్టాన్ని ప్రతిపాదించగా.. డిజిటల్‌ చెల్లింపులు చెల్లవంటూ చేసిన తీర్మానానికి ఆమోద ముద్ర లభించడమే తర్వాయిగా మిగిలింది.

రష్యాకు అధికారిక కరెన్సీ రూబుల్‌. ఇతర ఏ తరహా చెల్లింపులు కుదరవంటూ స్పష్టత ఇచ్చింది ఆ చట్టం. దేశీయ-విదేశీ చెల్లింపులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. తాజా ప్రకటనతో ఎక్కువగా నష్టపోయేది యూరప్‌, ఉత్తర అమెరికా ఇన్వెస్టర్లే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ప్రతిపాదన కంటే ముందు రష్యాలో విరుద్ధమైన పరిస్థితులు కనిపించాయి.

రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌.. విదేశీ చెల్లింపుల కోసం క్రిప్టో తరహా పేమెంట్లకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో వాణిజ్య శాఖ మంత్రి డెనిస్‌ మంట్రురోవ్‌ కూడా క్రిప్టో పేమెంట్స్‌కు అనుకూల వ్యాఖ్యలే చేశాడు. ఏ క్షణమైనా క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత రష్యాలో లభించవచ్చని ఒక ప్రకటన చేశారు. ఆ ధైర్యంతో పాశ్చాత్య దేశాల నుంచి భారీగా క్రిప్టో ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. తాజా నిషేధంతో వాళ్లంతా పూర్తిగా మునిగిపోయినట్లేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

క్రిప్టోకరెన్సీ విషయంలో రష్యా ఇలా డబుల్‌ గేమ్‌ ఆడడం కొత్త విషయమేమీ కాదు. ఇంతకు ముందు కూడా ఇలాగే చేసింది. సుమారు లక్షన్నర మంది ఇన్వెస్టర్లు నష్టపోగా.. అమెరికన్‌ ఇన్వెస్టర్లను భారీగా దెబ్బ కొట్టే స్కెచ్‌తోనే పుతిన్‌ అలాంటి ప్రకటనలు ఇప్పించి ఉంటారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈసారి ఏకంగా మంత్రి వ్యాఖ్యలు, సెంట్రల్‌ బ్యాంక్‌ భరోసా నేపథ్యంలో భారీగానే పెట్టుబడులు పెట్టారు పాశ్చాత్య దేశాల ప్రముఖులు. 

ఈ ఏడాది మొదట్లో క్రిప్టో చెల్లింపులతో అక్రమ వ్యవహారాలకు తెర లేస్తుందంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌. మరోవైపు రష్యా ఆర్థిక వ్యవహారాల డైరెక్టర్‌ ఇవాన్‌ చెబెస్కోవ్‌ మాత్రం సెంట్రల్‌ బ్యాంక్‌ వాదనను తప్పుబట్టి, నియంత్రిస్తే చాలని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ జోక్యం చేసుకుని.. ఇరు వర్గాలను ఒక ఒప్పందానికి రావాలంటూ సూచించారు. దీంతో తాత్కాలిక ఊరట కింద.. రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌ విదేశీ చెల్లింపులకు అనుమతులు జారీ చేసింది.అప్పటి నుంచి బ్యాంకర్లు, రాజకీయ నాయకులు, అధికారులు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

చదవండి: క్రిప్టోలు ‘సముద్ర దొంగల ప్రపంచమే’!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement