న్యూఢిల్లీ: సినిమా ప్రదర్శన వ్యాపారంలో ఉన్న పీవీఆర్ ఐనాక్స్ వచ్చే ఏడాది కొత్తగా సుమారు 100 స్క్రీన్లను జోడిస్తోంది. ఇందుకోసం రూ.200 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు కంపెనీ ఈడీ సంజీవ్ కుమార్ బిజ్లి వెల్లడించారు. రాబోయే కాలంలో ఏటా 100 స్క్రీన్లను ప్రారంభిస్తామని తెలిపారు.
‘ఈ సంవత్సరం ఇప్పటివరకు 70 దాకా స్క్రీన్లను తెరిచాము. 45–50 తెరలను మూసివేశాం. 2024లో మరో 40 జతచేస్తాం. అలాగే మరో 10–15 మూసివేస్తాం. మొత్తంగా ఈ ఏడాది దాదాపు 75 మూసివేసి, 120 స్క్రీన్లను జోడించాలనే ఆలోచన ఉంది. అసెట్ లైట్ మోడల్‌ను అనుసరిస్తాం. పెట్టుబడికి పెద్ద సహకారం డెవలపర్ల నుండి వస్తోంది. డిసెంబర్ త్రైమాసికం ఇప్పుడు మెరుగైన స్థానంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అక్టోబర్ కాస్త నిస్తేజంగా ఉంది. కానీ నవంబర్ ఇప్పటికే జోరు మీద ఉంది. కొత్త సినిమాలు విడుదల కానుండడంతో క్యూ3 చాలా మెరుగ్గా కనిపిస్తోంది.
ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధ భాగం చాలా మెరుగ్గా ఉంది. ఏప్రిల్–సెప్టెంబర్ కాస్త స్తబ్దుగా ఉంది. ఎందుకంటే చాలా సినిమాల రిలీజ్‌లు అక్టోబర్–మార్చికి వాయిదా పడ్డాయి. కంపెనీ క్యూ3, క్యూ4లో విడుదలయ్యే కొత్త సినిమాలతో జోరుమీద ఉంది’ అని సంజీవ్ కుమార్ వివరించారు. మూవీ జాకీ పేరుతో ఆర్టిఫీషియల్ ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం పీవీఆర్ ఐనాక్స్ దేశవ్యాప్తంగా 111 నగరాల్లోని 355 ప్రాపర్టీలలో 1,744 తెరలను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment