వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా హెచ్చుతగ్గులను చవిచూసే వీలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నాయి. విప్రో లిమిటెడ్ 12న, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 14న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 16న క్యూ2(జులై- సెప్టెంబర్) ఫలితాలు విడుదల చేయనున్నాయి. ఈ కంపెనీలు ప్రకటించనున్న క్యూ3(అక్టోబర్- డిసెంబర్) ఆదాయ అంచనాలు(గైడెన్స్) సెంటిమెంటును ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఇతర అంశాలూ
దేశీ కంపెనీల క్యూ2 ఫలితాలతోపాటు.. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐల) పెట్టుబడులు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సైతం మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా భారీ సహాయక ప్యాకేజీకి సిద్ధమంటూ తెలియజేయడంతో వారాంతాన ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు జోరందుకున్నాయి. ఈ జోరు తొలి సెషన్‌లో కొనసాగే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న అధ్యక్ష ఎన్నికల డిబేట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. కాగా.. వచ్చే వారం యూఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు రిటైల్ అమ్మకాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల చేయనుంది.
40,000కు సెన్సెక్స్
ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఆర్‌బీఐ లిక్విడిటీ చర్యలు ప్రకటించడం, యూఎస్ ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలు వంటి అంశాలు గడిచిన వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో శుక్రవారం(9)తో ముగిసిన వారంలో సెన్సెక్స్ 1,812 పాయింట్లు లాభపడింది. 40,509 వద్ద ముగిసింది. తద్వారా 40,000 పాయింట్ల కీలక మార్క్ ఎగువన స్థిరపడింది. నిఫ్టీ సైతం 497 పాయింట్లు జమ చేసుకుని 11,914 వద్ద నిలిచింది. వెరసి మార్కెట్లు 7 నెలల గరిష్టం వద్ద ముగిశాయి. ఐటీ, ఫైనాన్స్ దిగ్గజాలు విప్రో 19 శాతం, టీసీఎస్ 12 శాతం, ఇన్ఫోసిస్ 9 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 11 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 9 శాతం చొప్పున ఎగశాయి.
Comments
Please login to add a commentAdd a comment