అప్పర్ లేయర్ నిబంధనల ఎఫెక్ట్
వచ్చే వారం బజాజ్ హౌసింగ్ షురూ
టాటా క్యాపిటల్, హెచ్‌డీబీ, ఏబీ ఫైనాన్స్ రెడీ
న్యూఢిల్లీ: అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలపై రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) నిబంధనల కారణంగా ఇకపై పలు పబ్లిక్ ఇష్యూలకు తెరలేవనుంది. ఈ విభాగంలో వచ్చే వారం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభంకానుంది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల వివరాల ప్రకారం కనీసం మరో మూడు కంపెనీలు ఈ జాబితాలో చేరనున్నాయి. వీటిలో టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ఏడాదిలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టింగ్‌కు ప్రయత్నించనున్నాయి.
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అప్పర్‌లేయర్ నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లు గుర్తింపు పొందిన మూడేళ్లలోగా ఐపీవోలు చేపట్టవలసి ఉంటుంది. ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్లు జోరుమీదుండటంతో నాణ్యతగల బిజినెస్‌లకు డిమాండ్ ఉన్నట్లు ఆనంద్ రాఠీ అడ్వయిజర్స్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ విభాగ డైరెక్టర్ సచిన్ మెహతా పేర్కొన్నారు. దీంతో మంచి విలువలు లభించేందుకు వీలున్నట్లు తెలియజేశారు. ఫలితంగా పలు ఎన్‌బీఎఫ్‌సీలు లిస్టింగ్ బాట పట్టనున్నట్లు అంచనా వేశారు. కేవలం ఆర్‌బీఐ నిబంధనల అమలుకోసమేకాకుండా నిధుల సమీకరణకు సైతం ఐపీవోలను వినయోగించుకోవచ్చని తెలియజేశారు. ఒకసారి లిస్టయితే నిధుల సమీకరణ సులభమవుతుందని వివరించారు.
క్యూ ఇలా
ఆర్‌బీఐ అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనల ప్రకారం చూస్తే దిగ్గజాలు టాటా సన్స్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్ ఏడాదిలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కావలసి ఉంది. వీటిలో పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌లో విలీనంకానుంది. ఇక టాటా సన్స్ లిస్టింగ్‌ను తప్పించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టాటా సన్స్ లిస్టింగ్ గేమ్‌చేంజర్‌గా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇన్వెస్టర్లు లిస్టింగ్ ద్వారా భారీ లాభాలు అందుకునేందుకు వీలుండటమే దీనికి కారణమని తెలియజేశారు. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి అధికస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకోగలదని భావిస్తున్నారు. దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాల హోల్డింగ్ కంపెనీగా నిలుస్తున్న టాటా సన్స్‌కు భారీ డిమాండ్ నెలకొంటుందని అంచనా వేశారు.
కీలక పరిణామం
ప్రయివేట్ రంగ హోల్డింగ్ దిగ్గజం టాటా సన్స్ లిస్టయితే వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ క్యాపిటల్ మార్కెట్లలో ఇది కీలక పరిణామంగా నిలుస్తుందని డీఏఎం క్యాపిటల్ సీఈవో ధర్మేష్ మెహతా పేర్కొన్నారు. భారత్‌లోనే అత్యంత ప్రముఖ గ్రూప్‌లలో ఒకటైన టాటా సన్స్‌కు దేశ, విదేశాల నుంచి గరిష్ట డిమాండ్ పుడుతుందని తెలియజేశారు.
వాటాదారులకు భారీ విలువ చేకూరుతుందని మార్కెట్ నిపుణులు పలువురు అభిప్రాయపడ్డారు. వెరసి కనీసం 5 శాతం వాటాను ఆఫర్ చేస్తే రూ. 55,000 కోట్లకుపైగా నిధులు లభించవచ్చని అంచనా వేశారు. లిక్విడిటీతోపాటు.. ట్రేడింగ్ పరిమాణం సైతం భారీఆ పెరుగుతుందని తెలియజేశారు.
లిస్టింగ్‌ను తప్పించుకునే యోచనతో టాటా సన్స్ ఇప్పటికే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను ఆర్‌బీఐకు స్వచ్చందంగా సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆర్‌బీఐ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరమని నిపుణులు పేర్కొన్నారు. కాగా.. 2018లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనూహ్య పతనానికితోడు.. డీహెచ్‌ఎఫ్‌ఎల్ సైతం విఫలంకావడంతో మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. కఠిన లిక్విడిటీ సవాళ్లు ఎదురయ్యాయి. ఫలితంగా 2021 అక్టోబర్‌లో ఆర్‌బీఐ సవరించిన ఎస్‌బీఆర్ మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా వ్యవస్థాగత రిస్కులను అడ్డుకోవడం, పాలనను మరింత పటిష్టపరచడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది.
ఇవీ నిబంధనలు
ఎస్‌బీఆర్ మార్గదర్శకాల ప్రకారం ఎన్‌బీఎఫ్‌సీలను నాలుగు విభాగాలు(లేయర్లు)గా విభజించింది. ప్రాథమిక(బేసిక్), మాధ్యమిక(మిడిల్), ఎగువ(అప్పర్), అత్యున్నత(టాప్) లేయర్లుగా ఏర్పాటు చేసింది. ఆయా కంపెనీల పరిమాణం, కార్యకలాపాలు, రిస్క్ స్థాయిల ఆధారంగా వీటికి తెరతీసింది. దీనిలో భాగంగా అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీలుగా గుర్తింపు పొందిన మూడేళ్ల కాలంలో స్టాక్ ఎక్స్చేంజీలలో లిస్టయ్యేలా నిబంధనలను సవరించింది. ఇందుకు అనుగుణంగా 2022 సెప్టెంబర్‌లో 16 సంస్థలను ఈ జాబితాలో చేర్చింది. అయితే 2023లో జాబితా నుంచి సంఘ్వీ ఫైనాన్స్‌ను తప్పించింది.
వెరసి 15 సంస్థలు అప్పర్‌లేయర్‌లో చేరాయి. వీటిలో పిరమల్ క్యాపిటల్, టాటాసన్స్‌లను మినహాయిస్తే 9 కంపెనీలు ఇప్పటికే లిస్టయినట్లు మెహతా వెల్లడించారు. బజాజ్ హౌసింగ్ ఐపీవో ప్రారంభంకానున్న కారణంగా మిగిలిన మూడు కంపెనీలు ఏడాదిలోగా లిస్ట్‌కావలసి ఉంటుంది. ఈ మూడు సంస్థలు 2025 సెప్టెంబర్‌లోగా పబ్లిక్ ఇష్యూలను చేపట్టవలసి ఉన్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్వెస్ట్‌మెంట్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment