ముంబై: అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు వాటి డిపాజిట్ల పరిమాణం ఆధారంగా... నాలుగు అంచెల సులభ నియంత్రణ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఆయా బ్యాంకుల ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేయడమే దీన్ని ఉద్ధేశ్యంగా పేర్కొంది. ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఎన్‌ఎస్ విశ్వనాథన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పట్టణ కోపరేటివ్ బ్యాంకుల బలోపేతానికి పలు సిఫారసులు చేయడం గమనార్హం.
బ్యాంకులు పనిచేస్తున్న ప్రాంతం, వాటి డిపాజిట్ల ఆధారంగా నాలుగు అంచెల నియంత్రణ విధానాన్ని సూచించింది. నెట్‌వర్త్, సీఆర్‌ఏఆర్, బ్రాంచ్‌ల విస్తరణ, వాటి రుణాల ఎక్స్‌పోజర్ పరిమితులు ఆధారంగా భిన్నమైన నియంత్రణ విధానం అవసరమని కమిటీ అభిప్రాయపడింది.
ఈ సిఫారసుల్లో చాలా వాటిని ఆర్‌బీఐ ఆమోదించడం గమనార్హం. అందులో భాగంగా తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. ఒకే జిల్లాలో పనిచేస్తున్న టైర్–1 కోపరేటివ్ బ్యాంకులకు కనీస నెట్‌వర్త్ రూ.2 కోట్లు, ఇతర అన్ని పట్టణ కోపరేటివ్ బ్యాంకులకు రూ.5 కోట్ల నెట్‌వర్త్ ఉండాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. నిజానికి అర్బన్ కోపరేటివ్ బ్యాంకుల్లో చాలా వరకు ఈ నిబంధనలను ఇప్పటికే పాటిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment