ముంబై: రుణాల ఎవర్‌గ్రీనింగ్‌కు చెక్ పెట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు .. గత 12 నెలల్లో తమ దగ్గర నుంచి రుణాలు తీసుకున్న సంస్థల్లో ఏఐఎఫ్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టకుండా నిబంధనలను కఠినతరం చేసింది. రుణగ్రహీతలకు పరోక్షంగా నిధులు అందించేందుకు ఆర్థిక సంస్థలకు ఇది ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఒక సర్క్యులర్‌లో వివరించింది.
సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉండే బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) తమ పెట్టుబడుల విధానాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఫండ్స్ (ఏఐఎఫ్)లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ ఏఐఎఫ్‌లలో వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఏంజెల్ ఫండ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ మొదలైనవి ఉంటాయి. అయితే, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు గతంలో తాము రుణాలిచ్చిన కంపెనీల్లో పలు ఏఐఎఫ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేస్తుండటమనేది ఆయా సంస్థలకు మరిన్ని నిధులను సమకూర్చడం కిందికే వస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది.
ఇకపై అవి తమ నుంచి రుణం తీసుకున్న ఏ సంస్థలోనూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పెట్టుబడులు పెట్టే ఏఐఎఫ్‌కి చెందిన ఏ స్కీములోనూ ఇన్వెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే చేసిన పెట్టుబడులను 30 రోజుల్లోగా ఉపసంహరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఒకవేళ అలా చేయలేకపోతే దానికి 100 శాతం మేర ప్రొవిజనింగ్ చేయాలని తెలిపింది. రుణాలను తిరిగి చెల్లించడంలో ఇబ్బందిపడుతున్న రుణగ్రహీతలకు మరిన్ని రుణాలివ్వడం లేదా కొన్ని నిబంధనలను సడలించి లోన్‌ను రెన్యువల్ చేయడం మొదలైనవి ఎవర్‌గ్రీనింగ్ కిందికి వస్తాయి. సాధారణంగా సదరు రుణాన్ని తమ ఖాతాల్లో మొండిబాకీగా చూపాల్సిన పరిస్థితి తలెత్తకుండా బ్యాంకులు ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment