ఎడాపెడా పర్సనల్ లోన్లు (personal loans) పొందడం ఇకపై కష్టతరం కానుంది. బ్యాంకులు (Banks), రుణ వితరణ సంస్థలు ప్రతి 15 రోజులకూ క్రెడిట్ బ్యూరో రికార్డ్‌లను అప్‌డేట్ చేయాలనే కొత్త నిబంధన అమలులోకి వస్తోంది. ఇది ఇప్పటివరకు నెల రోజులుగా ఉండేది. ఇప్పుడు ప్రతి రెండు వారాలకు రికార్డులు అప్‌డేట్ చేయనుండటంతో బహుళ రుణాలకు అర్హత పొందేవారి సంఖ్య తగ్గనుంది.
రిపోర్టింగ్ విరామాన్ని 15 రోజులకు తగ్గించాలని బ్యాంకులు, క్రెడిట్ బ్యూరోలకు గత ఆగస్టులోనే ఆర్బీఐ (RBI) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవస్థలను రూపొందించుకునేందుకు జనవరి 1 వరకు గడువు ఇచ్చింది. దీనివల్ల రుణదాతలు రుణగ్రహీతలకు సంబంధించి మెరుగైన రిస్క్‌ను అంచనా వేయవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది.
"ఈఎంఐలు (EMI) నెల అంతటా వివిధ తేదీలలో షెడ్యూల్ అయిఉంటాయి. నెలకు ఒకసారి రిపోర్టింగ్ సైకిల్ వల్ల డిఫాల్ట్‌లు లేదా చెల్లింపులను ప్రతిబింబించడంలో 40 రోజుల వరకు ఆలస్యం కావచ్చు. ఫలితంగా క్రెడిట్ మూల్యాంకనాల కోసం గడువు ముగిసిన డేటా వస్తుంది. 15-రోజుకోసారి రిపోర్టింగ్ సైకిల్ ఈ జాప్యాలను గణనీయంగా తగ్గిస్తుంది" అని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సీఆర్‌ఐఎఫ్ హై మార్క్ ఛైర్మన్ సచిన్ సేథ్ అన్నారు.
తరచుగా చేసే డేటా అప్‌డేట్‌లు "ఎవర్‌గ్రీనింగ్"(పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేయడం) వంటి పద్ధతులను కూడా నిరోధిస్తాయని రుణదాతలు చెబుతున్నారు. రిపోర్టింగ్ సైకిల్‌ను సగానికి తగ్గించడం ద్వారా క్రెడిట్ బ్యూరోలు, రుణదాతలు మరింత విశ్వసనీయమైన డేటాను పొందుతారు. ఇది నిర్ణయం తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన రుణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment