
న్యూఢిల్లీ: కోవిడ్–19 నేపథ్యంలో దేశంలో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. అలాగే వచ్చే ఆరు నెలలూ నిరాశావాద ధోరణే కనిపిస్తోందని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్, ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థలు ఫిక్కీ, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెండ్ మండలి (ఎన్‌ఏఆర్‌ఈడీసీఓ) నిర్వహించిన 25వ జాతీయ స్థాయి సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేకు సంబంధించిన సూచీ జనవరి–మార్చి మధ్య 31 వద్ద ఉంటే, ఏప్రిల్–జూన్ మధ్య 22కు పడిపోయింది.
ఇది ఆల్‌టైమ్ కనిష్టస్థాయి. ఈ మేరకు వెలువడిన ప్రకటనకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... నిరాశావాద ధోరణి కనిపిస్తున్నప్పటికీ, భవిష్యత్ సెంటిమెంట్ ఇండెక్స్ సమీక్షా కాలంలో 36 నుంచి 41కి పెరిగింది. లాక్‌డౌన్ మరింత సడలించే అవకాశాలు, పండుగల సీజన్, ఆర్థిక క్రియాశీలత మెరుగుపడే అవకాశాలు ఇందుకు ప్రధాన కారణాలు. జూలై తొలి 2 వారాల్లో జరిపిన సర్వేలో డెవలపర్లు, పీఈ ఫండ్స్, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది.
డిమాండ్ పెంపు చర్యలు అవసరం
ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పలు ఉద్దీపన చర్యలు ప్రకటించాయి. అయితే ఆర్థిక వ్యవస్థలో దీని ఫలితాలు కనిపించాలి. ఆర్థిక వ్యవస్థలో సెంటిమెంట్ మెరుగుపడ్డానికి తదుపరి డిమాండ్ పెంపు చర్యలు అవసరం. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగా న్ని చూస్తే, గృహ కొనుగోళ్లకు అదనపు పన్ను ప్రయోజనాలు కల్పించాలి. రుణ లభ్యతనూ పెంచాలి. క్లిష్టతరమైన పరిస్థితుల నుంచి ఈ రంగాన్ని గట్టెక్కించడానికి డెవలపర్ రుణాల రీస్ట్రక్చరింగ్ జరగాలి.
– శిశిర్ బైజాల్, సీఎండీ, నైట్ ఫ్రాంక్ ఇండియా
పన్నులు తగ్గించాలి...
నిజానికి కోవిడ్–19 మహమ్మారికి ముందే ఆర్థిక వ్యవస్థ బలహీనమై ఇది రియల్టీమీద ప్రభావం చూపింది. కోవిడ్–19 నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో పరిస్థితి మరింత తీవ్రమైంది. క్రియాశీలత పూర్తిగా పడిపోయింది. కనీసం ఒక నిర్దిష్ట కాల వ్యవధిలోనైనా పన్నులు, లెవీలు, స్టాంప్ డ్యూటీలు, జీఎస్‌టీ తగ్గింపు అవసరం. తద్వారా వ్యవస్థలో డిమాండ్ పెంపునకు దోహదపడవచ్చు. అలాగే రుణ పునర్‌వ్యవస్థీకరణ దిశగానూ చర్యలు అవసరం.
నిరంజన్ హిరనందని, ప్రెసిడెంట్, ఎన్‌ఏఆర్‌ఈడీసీఓ
Comments
Please login to add a commentAdd a comment