భారతదేశ ఖ్యాతి ప్రపంచానికి చాటి చెబుతున్న 'ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్' (ISRO)లో పనిచేయాలని చాలామంది కలలు కంటారు. కానీ ఆధునిక కాలంలో అలాంటి వారి సంఖ్య బాగా తగ్గిందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ 'ఎస్ సోమనాథ్' (S Somanath) తాజాగా వెల్లడించారు. ఇంతకీ ఈయన అలా ఎందుకన్నారు? కారణం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల నుంచి బయటకు వస్తున్న ఎంతోమంది ప్రతిభావంతులు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరటానికి సుముఖత చూపడం లేదు. దీనికి ప్రధాన కారణం జీతభత్యాలే అంటూ సోమనాథ్ తెలిపారు.
దేశంలోని అత్యుత్తమ ప్రతిభావంతులు ఇంజినీర్లుగా, ఐఐటీయన్లుగా ఉండాలి. వారు తప్పకుండా దేశ ప్రతిష్టను పెంచే ఇస్రోలో చేరాలి. కానీ నేడు అలా జరగడం లేదు. రిక్రూట్‌మెంట్స్ ప్రకటించినప్పటికీ ఎక్కువ మంది దీని కోసం ప్రయత్నించడం లేదు. కొందరు పనిచేసే స్థలం ముఖ్యమని భావించి చేరుతున్నారు, అలాంటి వారు చాలా తక్కువ ఉన్నారని వెల్లడించారు.
60 శాతం మంది
ఇస్రో చీఫ్ ఇంజనీర్లను రిక్రూట్ చేయడానికి ఇటీవల టీమ్ బయలుదేరింది. అయితే చాలామంది ఉద్యోగం కోసం వచ్చిన వారు శాలరీ స్ట్రక్చర్ చూసి ప్రెజెంటేషన్ నుంచి 60 శాతం మంది బయటకు వెళ్లిపోయారని సోమనాథ్ తెలిపారు.
గతంలో కొందరు ఇస్రోలో జీతాలు భారీగా ఉంటాయని భావించే వారు, కానీ గత నెలలో హర్ష్ గోయెంకా ఒక ట్వీట్‌లో సోమనాథ్ జీతం రూ. 2.5 లక్షలని, వేర్వేరు పోస్టులకు వేరువేరు వేతనం ఉంటుందని, అయితే ఇక్కడ ఇంజనీర్ల ప్రారంభ వేతనం దాదాపు రూ. 56,100 మాత్రమే అని తెలిపాడు.
ఇదీ చదవండి: నేపాల్‌లో ఇతడే రిచ్.. సంపద తెలిస్తే అవాక్కవుతారు!
ప్రస్తుతం ఐఐటీ చేసిన చాలామంది ఎక్కువ ప్యాకేజి కోసం చూస్తున్నారు, ఈ కారణంగా ఇస్రోలో చేరటానికి ఎవరూ ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. అయితే దేశంపై ఉన్న ప్రేమతో ఇక్కడ చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి 'సమృద్ జోషి' వెల్లడించాడు. కానీ టెక్నాలజీలో దూసుకెళుతున్న భారతదేశం ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉత్తమ ప్రతిభ ఉన్నవారు ముందుకు రావాలి. అందరూ శాలరీ గురించి మాత్రమే ఆలోచిస్తే రానున్న రోజులు ప్రశార్థకంగా మారుతాయి.
Comments
Please login to add a commentAdd a comment