అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనా దేశాల దిగుమతులపై సుంకాలు విధించిన నేపథ్యంలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఓ మీడియా సమావేశంలో టారిఫ్‌లకు సంబంధించి అడిగిన అంశాలపై ఆమె సమాధానమిచ్చారు. అమెరికా ఇటీవల తీసుకున్న సుంకాల పెంపు నిర్ణయం వల్ల నేరుగా భారత్‌పై పరిణామాలను అంచనా వేయడం ప్రస్తుతం తొందరపాటు అవుతుందన్నారు. అయితే భారత్ అప్రమత్తంగా ఉందని, టారిఫ్‌ల అంశాలను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు.
అమెరికా తాజాగా కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం, చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలు విధించింది. ఈ సెగ భారత్‌కు సైతం తాకనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా విధించిన సుంకాలు ప్రభావం భారత్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ వాణిజ్య సంఘర్షణ భారతీయ విధానకర్తలు, వ్యాపారుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రమంత్రి నిర్మతా సీతారామన్ మాట్లాడుతూ..‘అమెరికా కెనడా, మెక్సికో, చైనాలపై విధించిన సుంకాల ప్రభావం కచ్చితంగా భారత్‌పై ఎలా ఉంటుందో ప్రస్తుతం అంచనా వేయలేం. కానీ తప్పకుండా భారత్‌పై కొంత పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి భారత్ అన్నింటినీ గమనిస్తోంది. అప్రమత్తంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. బడ్జెట్ అనంతర జరిగిన మీడియా సమావేశంలో కూడా నిర్మలా సీతారామన్ భారత్‌పై ఈ సుంకాల పరోక్ష ప్రభావాలను అంగీకరించారు.
పరిశ్రమలకు ప్రోత్సాహం
వాణిజ్య పరిధిని విస్తరించడం, ఆత్మనిర్భరత (స్వావలంబన-దేశీయ తయారీని ప్రోత్సహించడం)పై దృష్టి సారించడం వల్ల అమెరికా సుంకాల నుంచి ఎదురయ్యే ఊహించని సవాళ్ల ప్రభావాన్ని తగ్గించవచ్చని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అన్వేషించడానికి పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ), ఎగ్జిమ్ బ్యాంక్ వంటి వాణిజ్య సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. నిత్యావసర సరుకులకు సంబంధించి దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాలని భారత్ లక్ష్యంగా చేసుకుంది. ప్రపంచ సరఫరా గొలుసుల్లో ఏర్పడే అంతరాయాలను నిర్వహించడానికి స్థానిక పరిశ్రమలు బాగా సన్నద్ధమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: అమెరికా సుంకాలకు కారణాలు.. భారత్‌పై ప్రభావం
టారిఫ్‌లు ఎందుకంటే..
అక్రమ వలసలు, అమెరికాలోకి మాదకద్రవ్యాల ప్రవాహానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించే విస్తృత వ్యూహంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను విధించాలని నిర్ణయించారు. ఈ టారిఫ్‌లు ప్రపంచ వాణిజ్యంపై గణనీయమైన ప్రభావాలను చూపుతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం వంటి పరిశ్రమలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment