ఉబర్ క్యాబ్ బుక్ చేసి ఎక్కాక ఏసీ ఆన్ చేయమన్న పాపానికి ఓ వినియోగదారుడికి డ్రైవర్ నుంచి వింత అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వివరాలను రెడ్డిట్‌లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ తాను ఏం పోస్ట్ చేశాడు.. అసలేం జరిగిందో తెలుసుకుందాం.
రెడ్డిట్‌లోని ‘నెర్డి-ఒజెడ్-బెంగళూరు’ అనే ఐడీలో వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం..‘ఉబర్ క్యాబ్ బుక్ చేశాను. కారులో ఎక్కిన కాసేపటికి ఏసీ ఆన్ చేయమని డ్రైవర్‌ను అభ్యర్థించాను. అతడు కన్నడలో ‘ఎందుకు ఏసీ, మీరు రైడ్‌ను రద్దు చేసుకోండి’ అన్నాడు. మరింత మర్యాదగా..దయచేసి పక్కన ఆపండి. నాకు మీ కారులో రావడం ఇష్టం లేదు అన్నాను. దాంతో డ్రైవర్ కోపంగా వెంటనే ఏసీ ఆన్ చేశాడు. కానీ పిచ్చివాడిలా కారు నడపడం ప్రారంభించాడు. సడన్ బ్రేక్‌లు వేయడం, సడన్ యాక్సిలరేషన్‌తో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. నాకు ‘వెర్టిగో’ సమస్య ఉంది. ఇలాంటి సడన్ జర్క్‌లకు మైకం కమ్ముతుందని చెప్పాను. కానీ నా మాటలు పట్టించుకోకుండా డ్రైవర్ అలాగే వ్యవహరించాడు. దాంతో వెంటనే ఉబర్ సేఫ్టీకి కాల్ చేశాను. కాల్ సెంటర్ వ్యక్తి నన్ను సురక్షితమైన ప్రదేశంలో దిగమని సలహా ఇచ్చాడు. కానీ డ్రైవర్ ఎక్కడా ఆపలేదు. తనపై నేను ఫిర్యాదు చేశానని డ్రైవర్‌కు అర్థమైంది. అతను నా పేరు, చిరునామా వివరాలను కాగితంపై రాసి, పికప్ లొకేషన్ తనకు తెలుసని తర్వాత తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు’ అని తెలిపారు.
ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో ఇంటర్నెట్ వినియోగదారులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేను కూడా ఇలాంటి ఒక డ్రైవర్ చేతిలో మోసపోయాను. ప్రజలను వేధించడానికి వారికి సాకు కావాలి’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘డ్రైవర్ మిమ్మల్ని బెదిరించాడని ఉబెర్‌కు ట్వీట్ చేయండి. ఈ వ్యవహారంపై ధ్రువీకరణ కోరుతూ వారికి ఈమెయిల్ పెట్టండి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి తెలుస్తుంది. డ్రైవర్‌కు మీ వివరాలు తెలుసని రాశారు కదా.. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి’ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: ఫిన్‌టెక్ కంపెనీలకు ఆర్‌బీఐ ఆదేశాలు
ఇదిలాఉండగా, ఏ కంపెనీ అయినా తన కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిస్తే దాన్ని ఎవరైనా ఆదరిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఉబర్ వంటి ఆన్‌లైన్ క్యాబ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు గ్రౌండ్ లెవల్‌లో వినియోగదారులకు నేరుగా సేవలందిస్తున్నవారికి కచ్చితమైన మార్గదర్శకాలు విడుదల చేసి వాటిని పాటించేలా చూడాలని సూచిస్తున్నారు. దాంతో కంపెనీకి మేలు జరుగుతుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment