
న్యూఢిల్లీ: ఆదాయం, లాభం, మార్కెట్ విలువ పరంగా దేశంలోనే నంబర్–1 కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. మీడియా ప్రచారంలో ఎక్కువగా కనిపించే కార్పొరేట్ సంస్థగా గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత మీడియా ప్రాచుర్యాన్ని పొందడంలో ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ ఉంది. భారతీ ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకు విజికీ న్యూస్ స్కోర్ రిపోర్ట్ 2021 విడుదలైంది. వార్తల్లో ప్రాధాన్యం మేరకు కంపెనీలకు విజికీ ర్యాంకులను కేటాయిస్తుంది.
ప్రధాన వార్తల్లో చోటు, మొత్తం మీద ఎన్ని వార్తల్లో కనిపించాయి, ఎంతమందికి చేరువ అయింది తదితర అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయిస్తుంది. 5,000కు పైగా ప్రచురణలను పరిశీలించి.. సంస్థలకు 0 నుంచి 100 వరకు స్కోర్ కేటాయిస్తుంది. మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్‌కు 2021 సంవత్సరానికి కేటాయించిన స్కోరు 84.9 కావడం గమనార్హం. అంతర్జాతీయంగా చూస్తే ఫేస్‌బుక్ మొదటి స్థానంలో ఉంది. ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్, యాపిల్, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయంగా 8వ స్థానం
రిలయన్స్ దేశీయంగా మొదటి స్థానంలో ఉంటే, అంతర్జాతీయంగా 8వ స్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ 6వ స్థానంలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టీసీఎస్, మారుతి సుజుకీ ఇండియా, వొడాఫోన్ ఐడియా, ఐసీఐసీఐ బ్యాంకు వరుసగా ఉన్నాయి. ఎన్‌టీపీసీ 13వ ర్యాంకును సొంతం చేసుకుంది. అత్యధిక ర్యాంకును దక్కించుకున్న ప్రభుత్వరంగ సంస్థగా నిలిచింది. మీడియాలో చక్కని ప్రాధాన్యం, కవరేజీ లభించేందుకు శక్తిమంతమైన, అవగాహన కలిగిన కార్పొరేట్ కమ్యూనికేషన్ బృందం కీలకమని విజికీ పేర్కొంది.
హాటెస్ట్ స్టార్టప్‌లు..
‘హాటెస్ట్ స్టార్టప్‌లు 2021’ పేరుతో విజికీ మరో నివేదికనూ విడుదల చేసింది. భారత్‌లో వివిధ రంగాల్లో ప్రభావం చూపించిన టాప్–200 స్టార్టప్‌లకు ఇందులో చోటు కల్పించింది. ఓలా, డ్రీమ్11, స్విగ్గీ, ఓయో, ఓలా ఎలక్ట్రిక్, భారత్‌పే, బైజూస్, క్రెడ్, మొబిక్విక్, అన్‌అకాడమీ టాప్–10 హాటెస్ట్ స్టార్టప్‌లుగా విజికీ తెలిపింది. ఈ బ్రాండ్లకు వార్తల్లో వచ్చిన ప్రాధాన్యం ఆధారంగానే ఈ స్కోరు ఇచ్చింది. ప్రచారం విషయంలో బ్రాండ్లు ఏ స్థానంలో ఉన్నాయి, వాటి ప్రజా సంబంధాలు, కార్పొరేట్ సమాచారం బలాన్ని తెలియజయడమే తమ నివేదిక లక్ష్యమని విజీకీ సీఈవో అన్షుల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment