![Reliance may be finalising deal to buy Disney India business - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/13/HOTSTAR%20RELIANCE.jpg.webp?itok=lMetFDkq)
న్యూఢిల్లీ: భారత్‌లో డిస్నీ–స్టార్ వ్యాపారాన్ని దక్కించుకోవడంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ మరింతగా దృష్టి పెట్టింది. 51% మెజారిటీ వాటా కొనుగోలుకు సంబంధించి వచ్చే వారం ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నగదు, స్టాక్ రూపంలో ఈ డీల్ ఉండొచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఇంకా చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయమేదీ తీసుకోలేదని వివరించాయి.
ఒప్పందం కుదుర్చుకున్నాక ఇరు సంస్థలు వ్యాపార మదింపు ప్రక్రియ చేపడతాయని తెలిపాయి. ఒప్పందం సాకారమైతే మీడియా రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరింతగా విస్తరించేందుకు దోహదపడనుంది. పలు సవాళ్ల నేపథ్యంలో భారత విభాగాన్ని విక్రయించే యోచనలో ఉన్నట్లు వాల్ట్ డిస్నీ సీఈవో బాబ్ ఐగర్ ఇటీవల సంకేతాలిచ్చిన నేపథ్యంలో తాజా డీల్ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కన్సాలిడేషన్ దిశగా ..
ఇప్పటికే జీ ఎంటర్‌టైన్‌మెంట్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా) విలీన ప్రక్రియ జరుగుతుండగా కొత్తగా రిలయన్స్, డిస్నీ–స్టార్ డీల్ కూడా కుదిరితే దేశీయంగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉందని ఎలార క్యాపిటల్ ఎస్‌వీపీ కరణ్ తౌరానీ తెలిపారు.
రెండు మీడియా దిగ్గజాలకు (సోనీ/రిలయన్స్) టీవీ/ఓటీటీ మార్కెట్లో సింహభాగం వాటా ఉంటుందని పేర్కొన్నారు. డిస్నీ–స్టార్ భారత వ్యాపార విభాగంలో స్టార్ ఇండియా తదితర టీవీ చానళ్లు, డిస్నీప్లస్‌హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఉన్నాయి. డీల్ అనంతరం డిస్నీ–స్టార్‌కు దేశీ వ్యాపారంలో మైనారిటీ వాటాలు ఉంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఒప్పందం అమలైతే విలీన సంస్థ దేశంలోనే అతి పెద్ద మీడియా సంస్థల్లో ఒకటిగా ఆవిర్భవించనుంది. రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకామ్ 18కి చెందిన 38 చానళ్లు, స్టార్ ఇండియాకి ఎనిమిది భాషల్లో ఉన్న చానళ్లతో కలిపి మొత్తం 70 టీవీ చానళ్లు ఉంటాయి. వాటితో పాటు 2 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు–డిస్నీప్లస్‌హాట్‌స్టార్, జియోసినిమా కూడా ఉంటాయి. 2019లో స్టార్‌ను ట్వంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్ నుంచి డిస్నీ కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment