న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఆర్‌ఐఎల్ గ్రూప్ కంపెనీ రిలయన్స్ రిటైల్.. రుణ సమీకరణ పరిమితిని రెట్టింపునకు పెంచేందుకు వాటాదారుల అనుమతిని కోరనుంది. వెరసి రూ. లక్ష కోట్ల రుణ పరిమితి ప్రతిపాదనను ఈ నెల 30న నిర్వహించనున్న వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో వాటాదారుల ముందు ఉంచనుంది. ప్రస్తుతం కంపెనీ రుణ సమీకరణ పరిమితి రూ. 50,000 కోట్లుగా ఉంది.
గతేడాది సెప్టెంబర్‌లో వాటాదారులు ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2022 మే 5న సమావేశమైన కంపెనీ బోర్డు రుణ సమీకరణ పరిమితిని రూ. లక్ష కోట్లకు పెంచేందుకు ప్రతిపాదించింది. తద్వారా బిజినెస్ అవసరాలకు అనుగుణంగా కంపెనీ సమయానుగుణ రుణ సమీకరణకు వీలు చిక్కనున్నట్లు ఏజీఎం నోటీసులో పేర్కొంది.
2022 మార్చి 31కల్లా రిలయన్స్ రిటైల్ స్థూల రుణ భారం రూ. 40,756 కోట్లుగా నమోదైంది. గత నెలలో జరిగిన ఆర్‌ఐఎల్ ఏజీఎంలో రిలయన్స్ రిటైల్ ఎఫ్‌ఎంసీజీ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో తాజా ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఏర్పడింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రిటైల్ బిజినెస్‌పై ఆర్‌ఐఎల్ రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment