పంపిణీదార్లకు భారీ మార్జిన్లు
సూపర్ స్టాకిస్టులకు రెట్టింపు
రిటైలర్లకు ఏకంగా 20 శాతం
ముంబై: పంపిణీదార్లకు అధిక మార్జిన్లను అందిస్తూ క్యాంపాతో సాఫ్ట్‌డ్రింక్స్ మార్కెట్లో సంచలనం సృష్టించిన రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్‌సీపీఎల్) తాజాగా స్నాక్స్ మార్కెట్‌పైనా గురిపెట్టింది. చిప్స్, బిస్కెట్స్ మొదలైన వాటి విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. సూపర్ స్టాకిస్ట్స్‌లకు మిగతా బ్రాండ్స్ అందించే 3–5 శాతంతో పోలిస్తే (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు కూడా కలిపి) దాదాపు రెట్టింపు ఇస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వివరించాయి. ఆర్‌సీపీఎల్ 6.5 శాతం ట్రేడ్ మార్జిన్‌ను ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి.
ఇక డిస్ట్రిబ్యూటర్ల స్థాయిలో చూస్తే 8 శాతం మార్జిన్లతో పాటు అదనంగా 2 శాతం (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు సహా) ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. సాధారణంగా డి్రస్టిబ్యూటర్లకు ఇతర స్నాక్ బ్రాండ్స్ 6–6.5 శాతం ఆఫర్ చేస్తుంటాయి. ఆర్‌సీపీఎల్ అటు రిటైలర్లకు ఏకంగా 20 మార్జిన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ సెగ్మెంట్లో చాలాకాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న బ్రిటానియా, పెప్సీకో, స్థానిక కంపెనీలు, ఇతర బ్రాండ్లు ఇచ్చేది 8–15 శాతంగా (మార్జిన్లు, స్కీములు కలిపి) ఉంటోంది. ఆర్‌సీపీఎల్ ప్రస్తుతం చిప్స్, నమ్‌కీన్స్ వంటి స్నాక్స్‌కి సంబంధించి అలాన్ బ్యూగుల్స్, స్నాక్‌ట్యాక్ బ్రాండ్లను, ఇండిపెండెన్స్ పేరిట బిస్కట్ బ్రాండ్‌ను విక్రయిస్తోంది.
42 వేల కోట్ల మార్కెట్..
అధ్యయనాల ప్రకారం దేశీయంగా స్నాక్స్ మార్కెట్ 2023లో సుమారు రూ. 42,695 కోట్ల స్థాయిలో ఉంది. ఇది వార్షికంగా 9.08 శాతం వృద్ధి చెందుతూ 2032 నాటికి రూ. 95,522 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. దేశీ ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లుగా ఆర్‌సీపీఎల్ 2022లో ప్రకటించింది. ఆ తర్వాత నుంచి కంపెనీ క్రమంగా కోలా మార్కెట్లోకి చొచ్చుకుపోయే వ్యూహాలను అమలు చేయడం మొదలెట్టింది.
పోటీ సంస్థలతో పోలిస్తే ఉత్పత్తులను తక్కువ ధరకే అందించడం, పంపిణీదార్లకు అధిక మార్జిన్లు ఇవ్వడం మొదలైనవి అమలు చేసింది. అమెరికాకు చెందిన అలాన్ బ్యూగుల్స్ బ్రాండ్‌ను భారత్‌కి తెస్తున్నట్లు గతేడది మే నెలలో ప్రకటించింది. సాల్టెడ్‌తో పాటు టొమాటో, చీజ్ తదితర ఫ్లేవర్లలో రూ. 10కే అందించనున్నట్లు పేర్కొంది. సాధారణంగా పెద్ద సంస్థలు మార్కెటింగ్ కోసం కేటాయించే దానిలో 10–15 శాతం కూడా ఖర్చు చేయకుండానే అమ్మకాలను పెంచుకునేందుకు సేల్స్ వ్యవస్థను కూడా ఆర్‌సీపీఎల్ పటిష్టం చేసుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిటైల్ స్టోర్స్‌లో వినియోగదార్ల దృష్టిని ఆకర్షించేందుకు మరిన్ని లాంచ్ ప్రమోషన్లను ఆఫర్ చేస్తోందని పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment