దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఆన్‌లైన్ ఫార్మసీ సంస్థ నెట్‌మెడ్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. రూ. 620 కోట్లు వెచ్చించడం ద్వారా నెట్‌మెడ్స్‌లో 60 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు ఆర్‌ఐఎల్ తాజాగా వెల్లడించింది. దీంతో డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో.. ఈకామర్స్ రంగంలో ఔషధ విభాగంలోకి సైతం ప్రవేశించేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జియోమార్ట్ పేరుతో ఆన్‌లైన్ గ్రాసరీ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆర్‌ఐఎల్ డీల్ ప్రకారం నెట్‌మెడ్స్ విలువను రూ. 1,000 కోట్లుగా విశ్లేషకులు అంచనా వేశారు. గత వారమే ఈకామర్స్ దిగ్గజం అమెజాన్.. బెంగళూరులో ఆన్‌లైన్ ఫార్మసీ విక్రయాలు ప్రారంభించింది. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఆర్‌ఐఎల్ నెట్‌మెడ్స్ కొనుగోలుతో పోటీ వేడెక్కనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా నెట్‌మెడ్స్, ఫార్మ్‌ఈజీ, మెడ్‌లైఫ్ తదితర పలు కంపెనీలు ఆన్‌లైన్ ద్వారా ఔషధ విక్రయాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
నెట్‌మెడ్స్ కథ..
ప్రదీప్ దాధా ఏర్పాటు చేసిన నెట్‌మెడ్స్ ఆన్‌లైన్ ద్వారా ఔషధాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తోంది. వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా వినియోగదారులకు పిల్లల సంరక్షణ ఉత్పత్తులతోపాటు.. డాక్టర్ల ఆపాయింట్‌మెంట్ సేవలను సైతం సమకూర్చుతోంది. ఏడాది కాలంగా సరైన ధర లభిస్తే వ్యాపారాన్ని విక్రయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. నెట్‌మెడ్స్‌లో ఇప్పటికే సింగపూర్ సంస్థ డాన్ పెన్ కాంబోడియా గ్రూప్, సిస్టెమా ఏషియా ఫండ్, ఆర్బిమెండ్ తదితరాలు ఇన్వెస్ట్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment