
ఇటీవల కొత్త చరిత్రను సృష్టిస్తూ సాగుతున్న డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా మరిన్ని రికార్డులను సాధించింది. అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌లో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌కు వాటాను ఆఫర్ చేసిందన్న వార్తలతో ఆర్‌ఐఎల్ షేరుకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 8.4 శాతం దూసుకెళ్లింది. రూ. 2,345కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) ఏకంగా రూ. 15 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో తొలిసారి ఈ ఘనతను సాధించిన దిగ్గజ కంపెనీగా ఆర్‌ఐఎల్ నిలిచింది!
11 శాతం అప్
రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటాను పీఈ సంస్థ సిల్వర్ లేక్‌కు విక్రయించడం ద్వారా ఆర్‌ఐఎల్ షేరు జోరందుకుంది. వెరసి రెండు రోజుల్లోనే ఈ షేరు 11 శాతం ర్యాలీ చేసింది. 1.75 శాతం వాటా కోసం సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనుండటంతో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరింది. పీఈ కంపెనీ కేకేఆర్ రిలయన్స్ రిటైల్‌లో 1.5 బిలియన్ డాలర్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు సౌదీ ఫండ్స్ సైతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. తాజాగా రిలయన్స్ రిటైల్‌లో అమెజాన్‌కు 20 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,45,000 కోట్లు) విలువైన వాటాను ఆర్‌ఐఎల్ ఆఫర్ చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఈ అంశంపై ఇరు కంపెనీలూ స్పందించనప్పటికీ షేరు దూకుడు చూపుతుండటం గమనార్హం!
Comments
Please login to add a commentAdd a comment