Stake Sale Buzz
-
టాటా గ్రూప్ సరికొత్త ప్లాన్స్, ఇక ఆ రంగంలోకి కూడా
ముంబై: వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీ బిస్లరీ ఇంటర్నేషనల్‌లో వాటాలు దక్కించు కోవడంపై దృష్టి సారించింది. ముందుగా కొంత కొనుగోలు చేసి, క్రమంగా వాటాలు పెంచుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి బిస్లరీ యాజమాన్యానికి టాటా గ్రూప్ సంస్థ టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) ఇప్పటికే ఆఫర్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీల్ కుదిరే విషయం ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నాయి. ఈ డీల్ కుదిరితే, వేగంగా విస్తరిస్తున్న బాటిల్ వాటర్ మార్కెట్లో పోటీ పడేందుకు టాటా గ్రూప్‌నకు చెందిన ఎఫ్ఎంసిజి విభాగానికి ప్రీమియం సెగ్మెంట్లో పట్టు లభించినట్టేనని పరిశీలకులు పేర్కొన్నారు. కాగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇప్పటికే హిమాలయన్ బ్రాండ్‌తో ప్యాకేజ్ చేయబడిన మినరల్ వాటర్‌ను, హైడ్రేషన్ విభాగంలో టాటా కాపర్ ప్లస్ వాటర్,టాటా గ్లూకో+ వంటి బ్రాండ్లతో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
రేవతీ ఎక్విప్మెంట్- బీఈఎంఎల్ జోరెందుకు?
ముంబై, సాక్షి: కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్లు అందుబాటులోకి రానుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డుల ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 260 పాయింట్లు జంప్‌చేసి 48,129కు చేరింది. తద్వారా మార్కెట్ చరిత్రలో తొలిసారి 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా నిఫ్టీ సైతం 96 పాయింట్లు ఎగసి 14,114 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా రేవతీ ఎక్విప్మెంట్ 52 వారాల గరిష్టాన్ని తాకగా.. ప్రభుత్వ వాటా విక్రయ వార్తలతో పీఎస్‌యూ బీఈఎంఎల్ లిమిటెడ్ కౌంటర్‌కూ డిమాండ్ పెరిగింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. చదవండి: (2021లో పెట్టుబడికి 6 స్టాక్స్) రేవతీ ఎక్విప్మెంట్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీ షేర్లను స్వచ్చందగా డీలిస్టింగ్ చేయనున్నట్లు రేవతీ ఎక్విప్మెంట్ యాజమాన్యం తాజాగా వెల్లడించింది. సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీనీ డీలిస్ట్ చేసేందుకు ప్రతిపాదించినట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈకి రేవతీ తెలియజేసింది. డీలిస్టింగ్ అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 7న సమావేశమవుతున్నట్లు పేర్కొంది. పూర్తి వాటాను ప్రమోటర్లు సొంతం చేసుకోవడం ద్వారా కార్యకలాపాల వృద్ధికీ, ఆర్థికావసరాలు తీర్చేందుకు వీలుంటుందని డీలిస్టింగ్ ప్రతిపాదనపై స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేవతీ ఎక్విప్మెంట్ షేరు ఎన్ఎస్ఈలో 20 శాతం జంప్‌చేసింది. రూ. 93 పెరిగి రూ. 556 వద్ద ఫ్రీజయ్యింది. వెరసి ఏడాది గరిష్టాన్ని తాకింది. జనవరి 2కల్లా కంపెనీలో ప్రమోటర్ సంస్థలకు 72.58 శాతం వాటా నమోదైంది. పబ్లిక్ వాటా 27.42 శాతంగా ఉంది. బీఈఎంఎల్ లిమిటెడ్ కంపెనీలో 26 శాతం వాటాతోపాటు.. యాజమాన్య నియంత్రణ హక్కులనూ విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో రక్షణ, ఇంజినీరింగ్ రంగ కంపెనీ బీఈఎంఎల్ లిమిటెడ్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో తొలుత దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 1,051ను తాకింది. ప్రస్తుతం 3.5 శాతం లాభంతో రూ. 1,009 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 54 శాతం వాటా ఉంది. వ్యూహాత్మక వాటా విక్రయంలో భాగంగా ప్రభుత్వం బీఈఎంఎల్లో 26 శాతం వాటా విక్రయానికి నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను నిర్వహించేందుకు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌ను ఎంపిక చేసుకుంది. శుక్రవారం ముగింపు ధరలో చూస్తే ప్రభుత్వానికి వాటా విక్రయం ద్వారా రూ. 1,055 కోట్లు సమకూరే అవకాశముంది. -
శాంగ్యాంగ్ విక్రయానికి మహీంద్రా రెడీ
న్యూఢిల్లీ, సాక్షి: విదేశీ అనుబంధ సంస్థ శాంగ్యాంగ్ మోటార్ కంపెనీ(ఎస్‌వైఎంసీ)ను విక్రయించేందుకు దేశీ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సన్నాహాలు చేస్తోంది. నష్టాలతో కుదేలైన ఈ దక్షిణ కొరియా అనుబంధ కంపెనీ ఇటీవలే దివాళా పిటిషన్‌తో పునరుద్ధరణకు దరఖాస్తును చేసుకుంది. కాగా.. ఎస్‌వైఎంసీలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలతో చర్చలు చేపట్టినట్లు ఎంఅండ్ఎం వెల్లడించింది. వచ్చే వారంలో వాటా అమ్మకంపై తప్పనిసరికాని(నాన్‌బైండింగ్) ఒప్పందాన్ని కుదుర్చుకునే వీలున్నట్లు వెల్లడించింది. (జేవీకి.. ఫోర్డ్, మహీంద్రాల ‘టాటా’) 75 శాతం వాటా కొరియన్ కంపెనీ శాంగ్యాంగ్ మోటార్లో దేశీ దిగ్గజం ఎంఅండ్ఎం ప్రస్తుతం 75 శాతం వాటాను కలిగి ఉంది. వాటా విక్రయ ఒప్పందం ఫిబ్రవరి చివరికల్లా పూర్తికావచ్చని అంచనా వేస్తోంది. గత నెలలో అంటే 2019 డిసెంబర్ 21న శాంగ్యాంగ్ మోటార్ దివాళా పిటిషన్ వేసిన విషయం విదితమే. నష్టాలు పెరిగిపోవడంతో దివాళా చట్ట ప్రకారం కంపెనీ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసింది. సియోల్ దివాళా చట్ట కోర్టు ఈ అంశంపై చర్యలు తీసుకోనుంది. ఇందుకు అనుగుణంగా స్వతంత్ర పునర్వ్యవస్థీకరణ మద్దతు(ఏఆర్ఎస్)కు సైతం శాంగ్యాంగ్ దరఖాస్తు చేసింది. ఏఆర్ఎస్లో భాగంగా కంపెనీ పునర్వ్యవస్థీకరణ కోసం సొంత ప్రయత్నాలు చేసుకునేందుకు వీలుంటుందని ఎంఅండ్ఎం ఎండీ పవన్ గోయెంకా పేర్కొన్నారు. ఇందుకు ఫిబ్రవరి 28వరకూ కోర్టు గడువిచ్చినట్లు చెప్పారు. దీంతో రెండు నెలల గడువు ముగిసేలోగా వాటా విక్రయానికి వీలుగా ఇన్వెస్ట్మెంట్ సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. (ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్- లిస్టింగ్ భళా) డీల్ కుదిరితే వచ్చే నెలాఖరులోగా ఎవరైనా ఇన్వెస్టర్ మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తే శాంగ్యాంగ్ మోటార్ తిరిగి యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుంటుందని గోయెంకా చెప్పారు. లేదంటే యాజమాన్యం కోర్టు చేతికి వెళుతుందని, దివాళా చట్ట ప్రకారం పునరుద్ధరణ చర్యలు ప్రారంభంకావచ్చని తెలియజేశారు. మార్చి 1లోగా డీల్ కుదిరితే కంపెనీలో కొత్త యాజమాన్యానికి మెజారిటీ వాటా బదిలీ అవుతుందని, సుమారు 30 శాతం మైనారిటీ వాటాతో ఎంఅండ్ఎం కొనసాగుతుందని విశ్లేషించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 25 శాతం పెట్టుబడుల కుదింపును కంపెనీ చేపడుతుందని తెలియజేశారు. 2010లో 2017 నుంచి నష్టాలు నమోదు చేస్తున్న శాంగ్యాంగ్ మోటార్‌ను 2010లో ఎంఅండ్ఎం కొనుగోలు చేసింది. తదుపరి 11 కోట్ల డాలర్ల(సుమారు రూ. 800 కోట్లు)ను ఇన్వెస్ట్ చేసింది. 2019కల్లా నష్టాలు 341 బిలియన్ కొరియన్ వన్‌కు చేరాయి. దీంతో గత ఏప్రిల్‌లో ఎంఅండ్ఎం బోర్డు శాంగ్‌యాంగ్‌కు మరిన్ని నిధులను అందించేందుకు తిరస్కరించింది. ఫలితంగా 2020 డిసెంబర్‌కల్లా 60 బిలియన్ వన్(రూ. 400కోట్లకుపైగా) రుణ చెల్లింపుల్లో శాంగ్యాంగ్ విఫలమైంది. ప్రస్తుతం శాంగ్‌యాంగ్‌కు 100 బిలియన్ వన్(రూ. 680 కోట్లు) రుణభారమున్నట్లు తెలుస్తోంది. -
ఎస్బీఐ లైఫ్ నుంచి బీఎన్పీ పరిబాస్ ఎగ్జిట్!
ముంబై: దేశీ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ), గ్లోబల్ దిగ్గజం బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ మధ్య రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న భాగస్వామ్యానికి తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో మిగిలిన 5.2 శాతం వాటాను బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ విక్రయించేందుకు నిర్ణయించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. బ్లాక్ డీల్ ద్వారా ఈ వాటాను విక్రయించే యోచనలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా 5.2 శాతం వాటాకు రూ. 4,312 కోట్లు లభించే వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేరు శుక్రవారం రూ. 863 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో ఈ షేరు 8 శాతం లాభపడింది. విక్రయాల బాట దేశీ భాగస్వామ్య సంస్థ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో వాటాను గత రెండేళ్లుగా యూరోపియన్ దిగ్గజం బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ విక్రయిస్తూ వస్తోంది. 2019 జూన్‌లో ఎస్బీఐ లైఫ్‌లో 2.5 శాతం వాటాను బీఎన్పీ పరిబాస్ రూ. 1,625 కోట్లకు విక్రయించింది. ఈ బాటలో 2019 మార్చిలో 5 శాతం వాటాను రూ. 2,889 కోట్లకు అమ్మివేసింది. తదుపరి మరో 9.2 శాతం వాటాను రూ. 4,751 కోట్లకు విక్రయించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) కంటే బ్లాక్‌డీల్ ద్వారా వాటా విక్రయాన్ని వేగంగా చేపట్టవచ్చని ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు ప్రస్తావించారు. ప్రస్తుతం ఎస్బీఐ లైఫ్‌లో ప్రమోటర్‌గా ఉన్న బీఎన్పీ పరిబాస్ కార్డఫ్కు 5.2 శాతం వాటా మాత్రమే ఉంది. మరోవైపు ఈ జేవీలో ప్రమోటర్‌గా బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 55 శాతం వాటాను కలిగి ఉంది. 5 శాతం మించితే కంపెనీ ఈక్విటీలో 5 శాతం వాటాకు మించి విక్రయం, కొనుగోలు లేదా తనఖా చేపట్టదలిస్తే.. ఇందుకు ముందస్తు అనుమతి తీసుకోవలసి ఉంటుందంటూ బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ 2020 జులైలో స్పష్టం చేసింది. కాగా.. బీఎన్పీ పరిబాస్ వాటా విక్రయ అంశంపై ఎస్బీఐ లైఫ్.. మార్కెట్ అంచనాలపై తాము స్పందించబోమంటూ వ్యాఖ్యానించింది. జేవీ బ్యాక్‌గ్రౌండ్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 2001లో భాగస్వామ్య సంస్థ(జేవీ)గా ఏర్పాటైంది. పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్, బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ ప్రమోటర్లు కాగా.. 2017 అక్టోబర్‌లో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగానికల్లా బీమా రంగ మార్కెట్లో 11.7 శాతం వాటాను కలిగి ఉంది. బీమా రంగ గ్లోబల్ కంపెనీ బీఎన్పీ పరిబాస్ కార్డిఫ్ 33 దేశాలలో కార్యకలాపాలు విస్తరించింది. 2019లో 29.8 బిలియన్ యూరోల స్థూల రిటెన్ ప్రీమియంల విలువను సాధించింది. -
పేటీఎంలో వాటా విక్రయించం
న్యూఢిల్లీ, సాక్షి: ఈపేమెంట్స్ సర్వీసుల సంస్థ పేటీఎంలో వాటాను విక్రయించబోమని చైనీస్ దిగ్గజం యాంట్ గ్రూప్ ట్విటర్ ద్వారా తాజాగా పేర్కొంది. పేటీఎంలో 30 శాతం వాటాను అమ్మివేస్తున్నట్లు వెలువడిన వార్తలు అసత్యాలని చైనీస్ ఈకామర్స్దిగ్గజం అలీబాబా గ్రూప్‌నకు చెందిన యాంట్ గ్రూప్ స్పష్టం చేసింది. భారత్, చైనాల మధ్య రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పేటీఎం మాతృ సంస్థ అయిన ఒన్97 కమ్యూనికేషన్స్‌లో గల వాటాను యాంట్ గ్రూప్ విక్రయించనున్నట్లు బుధవారం ఆంగ్ల మీడియాలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. మరోవైపు వాటా విక్రయానికి సంబంధించి ప్రధాన వాటాదారులెవరితోనూ ఎలాంటి చర్చలూ చేపట్టలేదని, ఇలాంటి ప్రణాళికలేవీ లేవని, ఇవన్నీ ఆధారాలు లేని వార్తలని పేటీఎం ప్రతినిధులు సైతం ఖండించారు. చదవండి: (డిజిటల్ కరెన్సీవైపు జపాన్ చూపు) పోటీ ఎక్కువే దేశీయంగా డిజిటల్ చెల్లింపుల విభాగంలో పేటీఎంకు ఇటీవల తీవ్ర పోటీ ఎదురవుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా వాల్‌మార్ట్ సంస్థ ఫోన్‌పే, గూగుల్ పే, అమజాన్ పే తదితరాలతో పోటీ ఎదుర్కొంటున్నట్లు తెలియజేశాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, వాలెట్స్, మర్చంట్ కామర్స్ తదితర విభాగాలలో తీవ్ర పోటీ ఉన్నట్లు వివరించారు. మరోవైపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను పొందడం ద్వారా బ్యాంకులు, కార్డులను జారీ చేసే పేమెంట్ గేట్‌వేలతోనూ పోటీ పడుతున్నట్లు వివరించారు. ఆఫ్‌లైన్ మర్చంట్ విభాగంలో పైన్ ల్యాబ్స్‌ను ప్రత్యర్థి సంస్థగా తెలియజేశారు. కాగా.. 2019 నవంబర్‌లో ఇన్వెస్టర్ల నుంచి పేటీఎం బిలయన్ డాలర్లు సమీకరించింది. దీని ఆధారంగా పేటీఎం విలువను 16 బిలియన్ డాలర్లుగా నిపుణులు అంచనా వేశారు. వెరసి పేటీఎంలో యాంట్ గ్రూప్‌నకున్న వాటా విలువను 5 బిలియన్ డాలర్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. -
మిస్త్రీ ఎఫెక్ట్: షాపూర్జీ కంపెనీల హైజంప్
కొద్ది నెలలుగా నలుగుతున్న వివాదాల నేపథ్యంలో టాటా సన్స్ నుంచి వైదొలగవలసిన అవసరమున్నట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తాజాగా పేర్కొంది. టాటా సన్స్‌లో షాపూర్జీ గ్రూప్‌నకు 18.37 శాతం వాటా ఉంది. తద్వారా టాటా గ్రూప్‌లో పల్లోంజీ మిస్త్రీ గ్రూప్ అతిపెద్ద వాటాదారుగా నిలుస్తూ వస్తోంది. వాటా విక్రయం ద్వారా రెండు గ్రూపుల మధ్య సుమారు ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అనుబంధానికి తెరపడనున్నట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. (టాటా గ్రూపునకు ఎస్పీ గ్రూప్ టాటా) వాటా కొనుగోలు షాపూర్జీ గ్రూప్ వాటాను మార్కెట్ ధరకే కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు ఇటీవల టాటా సన్స్ ప్రకటించింది. మరోవైపు టాటా సన్స్‌లో వాటా విక్రయం ద్వారా షాపూర్జీ గ్రూప్‌నకు భారీగా నిధులు సమకూరనున్నాయి. రూ. 1.5 లక్షల కోట్లు లభించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా షాపూర్జీ గ్రూప్ రుణ భారం భారీగా పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తద్వారా గ్రూప్ కంపెనీల రుణ భారాన్ని తగ్గించుకునేందుకు వీలు చిక్కనున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండ్టు ఎండ్ సోలార్ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ స్టెర్లింగ్ అండ్ విల్సన్, ఫోర్బ్స్ అండ్ కంపెనీ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. షేర్లు జూమ్ జూన్‌కల్లా స్టెర్లింగ్ అండ్ విల్సన్‌లో షాపూర్జీ గ్రూప్ వాటా 50.58 శాతంగా నమోదైంది. కంపెనీ ఆర్డర్‌బుక్ విలువ రూ. 5,696 కోట్లను తాకింది. ఈ ఏడాది ఏప్రిల్- జూన్ మధ్య కాలంలోనే 1 గిగావాట్ ఆర్డర్లు సంపాదించింది. వీటి విలువ రూ. 3,633 కోట్లుకాగా.. ఎన్ఎస్ఈలో స్టెర్లింగ్ అండ్ విల్సన్ షేరు 20 శాతం దూసుకెళ్లింది. కొనేవాళ్లు అధికంకాగా.. అమ్మకందారులు కరువుకావడంతో రూ. 39 ఎగసి రూ. 236 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇక మరోవైపు బీఎస్ఈలో ఫోర్బ్స్ అండ్ కంపెనీ సైతం 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 71 ఎగసి రూ. 1484 వద్ద ఫ్రీజయ్యింది. -
వారెవ్వా రిలయన్స్.. రూ. 15 లక్షల కోట్లకు!
ఇటీవల కొత్త చరిత్రను సృష్టిస్తూ సాగుతున్న డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా మరిన్ని రికార్డులను సాధించింది. అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌లో ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌కు వాటాను ఆఫర్ చేసిందన్న వార్తలతో ఆర్ఐఎల్ షేరుకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వెరసి ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8.4 శాతం దూసుకెళ్లింది. రూ. 2,345కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) ఏకంగా రూ. 15 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో తొలిసారి ఈ ఘనతను సాధించిన దిగ్గజ కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచింది! 11 శాతం అప్ రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటాను పీఈ సంస్థ సిల్వర్ లేక్‌కు విక్రయించడం ద్వారా ఆర్ఐఎల్ షేరు జోరందుకుంది. వెరసి రెండు రోజుల్లోనే ఈ షేరు 11 శాతం ర్యాలీ చేసింది. 1.75 శాతం వాటా కోసం సిల్వర్ లేక్ రూ. 7,500 కోట్లను ఇన్వెస్ట్ చేయనుండటంతో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరింది. పీఈ కంపెనీ కేకేఆర్ రిలయన్స్ రిటైల్‌లో 1.5 బిలియన్ డాలర్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు సౌదీ ఫండ్స్ సైతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. తాజాగా రిలయన్స్ రిటైల్‌లో అమెజాన్‌కు 20 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,45,000 కోట్లు) విలువైన వాటాను ఆర్ఐఎల్ ఆఫర్ చేసినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఈ అంశంపై ఇరు కంపెనీలూ స్పందించనప్పటికీ షేరు దూకుడు చూపుతుండటం గమనార్హం! -
అమెజాన్ డీల్ : ఎయిర్టెల్ క్లారిటీ
సాక్షి,ముంబై: దేశీయ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌లో భారీ పెట్టుబడులు అంటూ వచ్చిన వార్తలపై స్పందించిన ఎయిర్టెల్ ఈ రూమర్లను కొట్టి పారేసింది. ఇటువంటి ఊహాగానాలు అనవసరమైన పరిణామాలకు దారి తీస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమైన అంశాలపై కంపెనీల స్పష్టమైన వివరణ లేకుండానే ఇలాంటి నివేదికలు వెలువడటం విచారకరమని వ్యాఖ్యానించింది. అంతేకాదు ఇలాంటి అంచనాలతో స్టాక్ ధర ప్రభావితమవుతుందని, తద్వారా తమ ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొంది. ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఎయిర్టెల్ స్పష్టత ఇవ్వడంతో శుక్రవారం నాటి మార్కెట్ లో కంపెనీ షేరు 2 శాతానికి పైగా ఎగిసింది. (జియోలో పెట్టుబడుల ప్రవాహం: మరో మెగా డీల్) అటు భారతి ఎయిర్‌టెల్‌లో వాటాలు కొనుగోలు వార్తలపై స్పందించేందుకు అమెజాన్ ప్రతినిధి ఇప్పటికే తిరస్కరించారు. భవిష్యత్తులో తాము ఏం చేయబోతున్నాం అనే ఊహాగానాలపై వ్యాఖ్యానించలేమన్నారు. కాగా అమెరికా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సుమారు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. (బుల్ దౌడు : ట్రిపుల్ సెంచరీ) -
మీడియా షాక్ : కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై: లాభాలతో ఉత్సాహంగా కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు అకస్మాత్తుగా నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా మీడియా షేర్లలో అమ్మకాల వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా కోల్పోయింది. డబుల్ సెంచరీ లాభాలతో మొదలైన మార్కెట్లు తిరిగి 200 పాయింట్లు కోల్పోయాయి. మొత్తంగా దలాల్ స్ట్రీట్ 400 పాయింట్లు కుప్పకూలింది. మీడియా ఏకంగా 13శాతం కుప్పకూలింది. ఇందులో ప్రధానంగా ఎస్సెల్ గ్రూప్ కౌంటర్లలో భారీగా అమ్మకాలు ఊపందుకోవడం మార్కెట్లను దెబ్బతీసింది. పెద్ద నోట్ల రద్దు కాలంలో జీ ఎంటర్టైన్మెంట్ యాజమాన్యం భారీగా అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు వాటా కొనుగోలుకు సంబంధించి సోనీ, జీ ప్రమోటర్ అయిన ఎస్సెల్ గ్రూపుతో చర్చలు జరుపుతోందని వార్తలు తాజాగా వెలువడ్డాయి. దీంతో అమ్మకాలు జోరందుకున్నాయి. మీడియా కౌంటర్లలో జీ ఎంటర్టైన్మెంట్ 25 శాతం కుప్పకూలింది. దీంతో ఆల్‌టైం కనిష్టాన్ని తాకింది. డిష్ టీవీ 19 శాతం పతనమైంది. ఇంకా జీ మీడియా, సన్ టీవీ, ఈరోస్, టీవీ 18, జాగరణ్, పీవీఆర్, డీబీ కార్ప్ 6-2 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు ఈ వార్తలపై స్పందించేందుకు సోనీ ప్రతినిధి నిరాకరించారు. అటు జీ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధి స్పందిస్తూ ప్రస్తుతం దీనిపై ఏమీ వ్యాఖ్యానించలేమని, ఈనేపథ్యంలో ఎలాంటి ఊహాగానాలను, పుకార్లను వ్యాప్తి చేయవద్దని కోరారు. చర్చలు కీలక దశకు చేరుకున్నాక కంపెనీ చేసే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా గత ఏడాది నవంబరులో అంతర్జాతీయ వ్యూహాత్మక ప్రణాళిలో భాగంగా జీలో మేజర్ వాటాను విక్రయించనున్నామని ఎస్సెల్ గ్రూపు ప్రకటించడం గమనార్హం. -
పీవీఆర్ పై కన్నేసిన వాండా?
ప్రముఖ థియేటర్ల నిర్వహణ సంస్థ పీవీఆర్ లిమిటెడ్ లో అతిపెద్దవాటాను చైనాకు చెందిన ఒక ప్రముఖ కంపెనీ కొనుగోలు చేయనుందన్న వార్తలు వెలు వడ్డాయి.. మల్టీఫ్లెక్స్ రంగంలో దూసుకుపోతున్న పీవీఆర్ లో మేజర్ షేర్ కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు హల్ చల్ చేశాయి. చైనా రియల్టీ దిగ్గజం దలియాన్ వాండా గ్రూప్ పీవీఆర్ ను కొనుగోలు చేయనుందన్న అంచనాలతో మార్కెట్ల్ ఈ షేర్ భారీ లాభాలను ఆర్జించింది. సుమారు 8 శాతం ఎగిసి 52 వారాల గరిష్టాన్ని తాకింది. చైనాలోని సుప్రసిద్ధ బహుళజాతి సంస్థ, ఆసియాలో అతిపెద్ద సినిమా గ్రూప్, థియేటర్ ఆపరేటర్ వాండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భారతదేశం యొక్క మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్‌లో వాటాల కొనుగోలు చర్చలు జరుపుతోందట. మరోవైపు ఈ వార్తల నేపథ్యలో బీఎస్ఈ పీవీఆర్ ను వివరణ యివ్వాల్సిందిగా కోరింది. కాగా పీవీఆర్ ప్రస్తుతం దేశంలోని 48 నగరాల్లో 557 స్ర్కీన్లతో విజయవంతంగా తన వ్యాపారాన్ని సాగిస్తోంది. ఇటీవల ముంబైలోని ఆరు స్ర్కీన్ల మల్టీప్లెక్స్ ఎక్స్ పీరియాను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.