
న్యూఢిల్లీ: పెరిగే వడ్డీ రేట్లతో ఇళ్ల డిమాండ్‌కు సమీప కాలంలో సవాళ్లు నెలకొన్నాయని డీఎల్‌ఎఫ్ చైర్మన్ రాజీవ్‌సింగ్ పేర్కొన్నారు. అయినా పరిశ్రమపై గణనీయమైన ప్రభావం ఉండకపోవచ్చన్నారు. నివాస గృహాలకు డిమాండ్ పరంగా గడిచిన రెండేళ్లలో నిర్మాణాత్మక రికవరీ కనిపిస్తోందని.. పరిశ్రమలో స్థిరీకరణ కారణంగా నమ్మకమైన సంస్థలు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నట్టు తెలిపారు.
కంపెనీ వాటాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్లకు ఉన్న డిమాండ్, దేశ ఆర్థిక వ్యవస్థ బలం ఈ రంగానికి మద్దతునిస్తాయన్నారు. ఆర్‌బీఐ గడిచిన మూడు నెలల్లో మూడు విడతలుగా 1.40 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. దీంతో బ్యాంకులు సైతం వెంటనే రుణ రేట్లను పెంచేశాయి.
6.5-7 శాతం మధ్య ఉన్న గృహ రుణ రేట్లు 8-8.5 శాతానికి చేరాయి. డిమాండ్‌కు అనుగుణంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొత్త ఉత్పత్తులను అందిస్తున్నట్టు రాజీవ్‌సింగ్ చెప్పారు. దీంతో కొత్త ఇళ్ల బుకింగ్‌లలో మెరుగైన వృద్ధిని నమోదు చేస్తామన్న ఆశాభావాన్ని తెలిపారు. డీఎల్‌ఎఫ్ సేల్స్ బుకింగ్‌లు 2021-22లో రూ.7,273 కోట్లకు పెరగ్గా.. అంతకు ముందు సంవత్సరంలో ఇవి రూ.3,084 కోట్లుగానే ఉన్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బుకింగ్‌లు రెట్టింపై రూ.2,040 కోట్లుగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment