రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ రాబోయే రెండేళ్లలో భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేయాలని చూస్తోంది. ఇందుకోసం కోసం 1,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సిద్ధార్థ లాల్ తెలిపారు. ఉత్పత్తి మాడ్యులర్ పద్ధతిలో క్రమంగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
గుర్గావ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో 90 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ అవసరాలను అంచనా వేయడానికి ఒక వాణిజ్య బృందాన్ని నియమించినట్లు తెలిపింది.
ప్రస్తుతం ప్రోటోటైప్‌ను పరీక్షిస్తున్నామని, రెండేళ్లలో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేస్తామని సిద్ధార్థ లాల్ వెల్లడించారు. భారతదేశంలో మిడ్-వెయిట్ మోటార్‌సైకిళ్ల మార్కెట్ వేగంగా పెరుగుతోందని చెప్పారు. కంపెనీ గత త్రైమాసికంలో 225,368 రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను విక్రయించిందని, ఇది ఏడాది క్రితంతో పోలిస్తే 21 శాతం పెరిగిందని ఆయన వివరించారు.
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా), బజాజ్ ఆటో రాబోయే నెలల్లో దాదాపు డజను మిడ్-వెయిట్ మోటార్‌సైకిళ్లను రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా తీసుకొస్తున్నాయి. గత నెలలో బజాజ్-ట్రయంఫ్ భారతదేశంలో రెండు 400సీసీ మోడళ్లను విడుదల చేసింది. అలాగే హార్లే డేవిడ్‌సన్‌తో కలిసి హీరో మోటర్ కార్ప్ అభివృద్ధి చేసిన X440 బైక్ డెలివరీలను త్వరలో ప్రారంభించాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment