
న్యూఢిల్లీ: ఆహారశుద్ధి పరిశ్రమ (ఫుడ్ ప్రాసెసింగ్) కు ఉత్పత్తి ఆధారిత పథకాన్ని (పీఎల్‌ఐ స్కీమ్) అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.10,900 కోట్ల ప్రోత్సాహకాలను ఆరేళ్ల పాటు 2026–27 నాటి వరకు అందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. దీనివల్ల 2026–27 నాటికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని.. అదే విధంగా ఎగుమతులు పెరుగుతాయని.. ఈ రంగం మరింత విస్తరించి రూ.33,494 కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నిర్ణయం రైతులకు ఇచ్చే గౌరవమని మంత్రి పీయూష్ గోయల్ సమావేశం అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
భారత రెడీటుఈట్ (తినడానికి సిద్ధంగా ఉన్న) ఉత్పత్తులకు, సహజసిద్ధ ఆహార ఉత్పాదనలకు, శుద్ధి చేసిన పండ్లు, కూరగాయలు, మత్స్య ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుండడంతో.. దేశ ఆహార శుద్ధి పరిశ్రమను తదుపరి స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని మంత్రి చెప్పారు. నిర్దేశిత కనీస పెట్టుబడులు పెట్టడంతోపాటు, నిర్దేశిత విక్రయాలను నమోదు చేసే ఆహార శుద్ధి, ఉత్పత్తుల తయారీ సంస్థలకు ఈ పథకం రూపంలో మద్దతు అందించనున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాల కోసం ఆసక్తి వ్యక్తీకరణలకు ఏప్రిల్ చివరి నాటికి ఆహ్వానం పలకనున్నట్టు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి పుష్ఫ సుబ్రమణ్యం తెలిపారు. దీనికింద కంపెనీలు కనీస పెట్టుబడులు పెట్టడంతోపాటు కనీస అదనపు విక్రయాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment