న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్‌బీఐ కార్డ్) నికర లాభం 67 శాతం ఎగిసింది. రూ. 345 కోట్లకు పెరిగింది. రిటైల్, కార్పొరేట్ కస్టమర్లు గణనీయంగా వ్యయాలు చేయడం ఇందుకు దోహదపడినట్లు సంస్థ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం రూ. 206 కోట్లు.
ఇక తాజా క్యూ2లో ఆదాయం 7 శాతం వృద్ధి చెంది రూ. 2,510 కోట్ల నుంచి రూ. 2,695 కోట్లకు పెరిగింది. ఫీజులు, సర్వీసుల విభాగాల నుంచి మరింత ఆదాయం రావడం ఇందుకు తోడ్పడినట్లు ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది. సమీక్షాకాలంలో నిర్వహణ వ్యయాలు 25 శాతం పెరిగి రూ. 1,383 కోట్లకు చేరినట్లు వివరించింది. వ్యాపార పరిమాణం పెరగడం ఇందుకు కారణమైనట్లు ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది.
మొండిబాకీలు తదితర అంశాలకు సంబంధించిన వ్యయాలు రూ. 862 కోట్ల నుంచి రూ. 594 కోట్లకు దిగి వచ్చాయి. కొత్త ఖాతాల సంఖ్య 6,88,000 నుంచి 39 శాతం వృద్ధి చెంది 9,53,000కు చేరింది. సెప్టెంబర్ ఆఖరు నాటికి వినియోగంలో ఉన్న కార్డుల సంఖ్య 14 శాతం పెరిగి 1.26 కోట్లకు చేరినట్లు, ఈ విషయంలో తమ మార్కెట్ వాటా 19.4 శాతంగా ఉన్నట్లు ఎస్‌బీఐ కార్డ్ పేర్కొంది.
బీఎస్‌ఈలో గురువారం ఎస్‌బీఐ కార్డ్ షేరు సుమారు 1 శాతం క్షీణించి రూ. 1,124 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment