భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎంల నుంచి ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణకు సమయం పొడిగించినట్లు ప్రకటించింది. దీనిని వినియోగదారులు శుక్రవారం (సెప్టెంబర్ 18) నుంచి వినియోగించుకోవచ్చు. జనవరిలో నెల నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ సదుపాయం కేవలం ఉదయం8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు రోజంతా ఆ సదుపాయం అందుబాటులోకి తెస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. దీని ద్వారా 10,000 నగదు వరకు ఉపసంహరించుకోవచ్చు.
ఏటీఎం వద్ద జరిగే మోసలను నివారించడం కోసం ఎస్‌బీఐ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కస్టమర్‌కు ఓటీపీ వస్తేనే నగదును తీసుకోవచ్చు. వినియోగదారులు నగదు భద్రత కోసం ఎస్‌బీఐ తీసుకువచ్చిన గొప్ప సంస్కరణగా దీనిని పేర్కొనవచ్చు. నగదు ఉపసంహరణ ఓటీపీని వినియోగదారుడు బ్యాంకులో నమోదు చేసుకున్న కస్టమర్ మొబైల్ నంబర్‌కు పంపిస్తారు. దీంతో వినియోగదారుడి అనుమతి లేకుండా ఎవరు నగదు తీసుకునే అవకాశం లేకండా ఉంటుంది.
అయితే ఈ సౌకర్యం కేవలం ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణకు మాత్రమే ఉపయోగపడుతుంది. లావాదేవీలకు ఇది వర్తించదు. ఇది కేవలం ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు మాత్రమే వీలవుతుంది. వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి ఉపయోగపడదు. కార్డ్ హోల్డర్ నగదు ఉపసంహరించుకోవాలనుకున్నప్పుడు ఎంత డబ్బు డ్రా చేయాలో ఎంటర్ చేసిన తరువాత, ఏటీఎం స్క్రీన్ ఓటీపీ విండోను చూపిస్తుంది. లావాదేవీని పూర్తి చేయడానికి కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment