SBI Cuts Home Loan Interest Rates, Waives Processing Fees - Sakshi
Sakshi News home page

SBI Home Loan: పండుగ సీజన్​ రాకముందే ఎస్​బీఐ ఆఫర్ల వర్షం

Published Thu, Sep 16 2021 3:16 PM | Last Updated on Thu, Sep 16 2021 4:15 PM

SBI Cuts Home Loan Interest Rates, Waives Processing Fees - Sakshi

ముంబై: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్​బీఐ పండుగ రాకముందే ఖాతాదారులకు ఆఫర్ల వర్షం కురిపించింది. త్వరలో రాబోయే పండుగ సీజన్​ దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తుంది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోరు ఆధారంగా జీరో ప్రాసెసింగ్ ఫీజుతో కేవలం 6.70 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలను అందిస్తున్నట్లు ఎస్​బీఐ పేర్కొంది. ఇంతకు ముందు రూ.75 లక్షల కంటే ఎక్కువ రుణాన్ని పొందాలంటే రుణగ్రహీత 7.15% వడ్డీ రేటు చెల్లించాల్సి వచ్చేది. పండుగ సీజన్​ దృష్టిలో పెట్టుకొని కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టడంతో రుణగ్రహీత ఇప్పుడు 6.70% కంటే తక్కువ రేటుతో గృహ రుణాన్ని పొందవచ్చు. 

రూ.8 లక్షలు ఆదా..
ఈ ఆఫర్ వల్ల 45 బీపీఎస్ పాయింట్లు ఆదా అవుతుంది. దీని వల్ల పరోక్షంగా రుణగ్రహీతకు రూ.8 లక్షలకు పైగా భారీ వడ్డీ ఆదా కానున్నట్లు సంస్థ పేర్కొంది. 30 సంవత్సరాల కాలానికి రూ.75 లక్షల రుణం అందించే అవకాశం ఉంటుంది. అలాగే, గతంలో వేతనేతర రుణగ్రహీతలకు వర్తించే వడ్డీ రేటు వేతన రుణగ్రహీతలకు వర్తించే వడ్డీ రేటు మధ్య 15 బీపీఎస్ వ్యత్యాసం ఉండేది. వేతన, వేతనేతర రుణగ్రహీతల మధ్య ఈ వ్యత్యాసాన్ని ఎస్​బీఐ తాజాగా తొలగించింది. ఇక వేతనేతర రుణగ్రహీతలకు 15 బీపీఎస్ వడ్డీ ఆదా అవుతుంది. (చదవండి: Gpay: గూగుల్‌ పే భారీ అవకతవకలు!)

ఈ కొత్త ఆఫర్ల వల్ల పండుగ సీజన్​లో ఖాతాదారులు, రుణగ్రహితలు మరింత సంతోషంగా పండుగలు జరుపుకుంటారు అని ఎస్​బీఐ పేర్కొంది. ఎస్​బీఐ మేనేజింగ్ డైరెక్టర్(రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ సెట్టీ మాట్లాడుతూ.. "ఈసారి, మేము ఆఫర్లను మరింత సమ్మిళితంగా చేసాము. రుణ మొత్తం అనేది రుణగ్రహీత వృత్తితో సంబంధం లేకుండా అందిరికి ఒకేవిధంగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 6.70% వడ్డీరేటు, జీరో ప్రాసెసింగ్ ఫీజులు, రాయితీ వడ్డీ రేట్లు గృహ రుణాలను మరింత చౌకగా చేస్తాయని మేము నమ్ముతున్నాము. ఈ మహమ్మారి సమయంలో మన దేశం అద్భుతమైన పురోగతి సాధిస్తుంది. ప్రతి భారతీయుడికీ బ్యాంకర్ గా అందరికీ గృహవసతి కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో మా వంతు కృషి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని ఆయన అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement