ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గృహ రుణాల కనీస వడ్డీ రేటును పెంచింది. ఎస్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ రుణ వడ్డీ రేట్లు 6.95 శాతం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ వడ్డీ రేటులో మార్పు అనేది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దేశంలో అతిపెద్ద రుణదాత అయిన ఎస్‌బీఐ మార్చిలో గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. మార్చి నెలలో 6.70 శాతం వడ్డీ రేటుతో బ్యాంకు గృహ రుణాలు అందించింది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు ఉంది. బ్యాంకు ఇప్పుడు గృహ రుణాల వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేటు ఇప్పుడు 6.95 శాతంగా ఉంది.
గృహ రుణాలపై ఏకీకృత ప్రాసెసింగ్ ఫీజును కూడా బ్యాంక్ విధిస్తుంది. ఇది రుణ మొత్తంలో 0.40 శాతం, అలాగే జీఎస్టీ చార్జీలు కూడా ఉంటాయి. మార్చిలో ఎస్‌బీఐ గృహ రుణ ప్రాసెసింగ్ ఫీజును మార్చి 31 వరకు మాఫీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో గృహ కొనుగోలుదారులు ఇతర బ్యాంకుల వైపు చూసే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా దేశంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంకు. ఇది దేశంలో అతిపెద్ద తనఖా రుణదాత. బ్యాంకు యొక్క గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ.5 లక్షల కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment