69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎస్‌బీఐ చొరవ
పదకొండు కీలక చర్యల ప్రకటన
డిజిటలైజేషన్‌కు పెద్దపీట
35 కొత్త వ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటు
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 69వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురష్కరించుకుని తన కస్టమర్లకు సేవలను మరింత విస్తృతం చేయడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పదకొండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించినట్లు వివరించింది. డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్లను మెరుగుపరచడం, తన వ్యవసాయ రుణ పోర్ట్‌ఫోలియోలో నష్టాలను తగ్గిండానికి 35 కొత్త వ్యవసాయ కేంద్రీకృత ప్రాసెసింగ్ సెల్‌లను ప్రారంభించడం ఇందులో ఉన్నాయి. కస్టమర్ల బ్యాంకింగ్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చడానికి, సేవల విస్తృతికి ఈ 11 చొరవలు దోహదపడతాయని బ్యాంక్ ప్రకటన ఒకటి పేర్కొంది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే..
→ తన డిజిటల్ చెల్లింపుల సౌలభ్యతను గణనీయంగా మెరుగుపరచుకున్నట్లు బ్యాంక్ పేర్కొంది. బీహెచ్‌ఐఎం ఎస్‌బీఐ పే యాప్‌లో ట్యాప్–అండ్–పే, అలాగే యోనో యాప్‌లో మ్యూచువల్ ఫండ్స్‌పై ఎండ్–టు–ఎండ్ (పూర్తిస్థాయి) డిజిటల్ లోన్‌లు వంటి రెండు అద్భుతమైన ఫీచర్‌లను పరిచయం చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొంది.
→ ఎస్‌బీఐ సూర్య ఘర్ లోన్ విషయంలో పూర్తి డిజిటలైజేషన్ మరో కీలకమైన చొరవగా బ్యాంక్ వివరించింది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి వినియోగదారులు రుణాలను పొందవచ్చని పేర్కొంది. 10 కేవీ సామర్థ్యం వరకు ఈ రుణాలు అందుబాటులో ఉంటాయి. ఎంఎన్‌ఆర్‌ఈ/ఆర్‌ఈసీ పోర్టల్‌లో దరఖాస్తుదారుల నమోదు నుండి లోన్ పంపిణీ వరకు మొత్తం ప్రక్రియ ఎస్‌బీఐ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించడం జరుగుతుందని తెలిపింది.
→ దేశం వృద్ధి చక్రాన్ని రూపొందించడంలో భారతీయ ప్రవాసుల గణనీయమైన సహకారాన్ని గుర్తించిన బ్యాంక్... పంజాబ్‌లోని పాటియాలాలో రెండవ గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ సెంటర్ (జీఎన్‌సీ) ప్రారంభించింది. ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారుల కు సేవలను మెరుగుపరచడానికి బ్యాంక్ డే రోజున పాటియాలాలో ఈ రెండవ గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ సెంటర్‌ను చైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు. ఈ సెంటర్‌లు గ్లోబల్ ఇండియన్ కమ్యూనిటీతో బ్యాంక్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయి. ఎక్సలెన్స్ హబ్‌లుగా పనిచేస్తాయి. ఎన్‌ఆర్‌ఐ కస్టమర్‌లకు ప్రత్యేక సేవలను అందిస్తాయి. భారతదేశంలో 434 ప్రత్యేక ఎన్‌ఆర్‌ఐ శాఖల నెట్‌వర్క్, 29 దేశాలలో విదేశీ కార్యాలయాలు, జీసీసీ ఆరు దేశాలలో (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్– బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) 45 ఎక్సే్ఛంజ్ హౌస్‌లు, 5 బ్యాంకులతో భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎన్‌ఆర్‌ఐ ఖాతాదారులకు సమగ్ర సేవలను అందించడానికి బ్యాంక్ సన్నద్దమైంది.
→ న్యాయవాదుల కోసం సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో పూర్తి సదుపాయాలతో కూడిన హైకోర్టు శాఖలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. న్యాయవాదులు, న్యాయ నిపుణుల అవసరాలను ప్రత్యేకంగా తీర్చడానికి ఈ శాఖలు దోహదపడతాయి.
→ గృహ రుణాలకు సంబంధించిన ప్రాసెస్ మరింత పారదర్శకం కానుంది. గృహ రుణ గ్రహీతలు ఇప్పుడు వివిధ ప్రాసెసింగ్ దశల్లో వారి రుణ దరఖాస్తు స్థితికి సంబంధించి ఆటోమేటెడ్ ఈ–మెయిల్, ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్‌లను ఎప్పటికప్పుడు అందుకుంటారు.
→ వినియోగదారు పూర్తి సంతృప్తి, సౌలభ్యత లక్ష్యంగా ఆధునికీకరించిన ఈ నూతన చర్యలకు శ్రీకారం చుట్టినట్లు బ్యాంక్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment