ఎస్‌బీఐ ఉద్యోగులకు 'స్వచ్ఛంద షాక్' | SBI VRS scheme 2020: Check out eligibility compensation | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ ఉద్యోగులకు మరో 'స్వచ్ఛంద షాక్'

Published Mon, Sep 7 2020 3:04 PM | Last Updated on Mon, Sep 7 2020 5:08 PM

SBI VRS scheme 2020: Check out eligibility compensation - Sakshi

సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి ఉద్యోగులకు షాకివ్వనుంది. ఖర్చులను తగ్గించే లక్ష్యంతో రెండవ విడత స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) అమలు చేయనుంది. ఇందులో భాగంగా దాదాపు 30,190 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. వీఆర్‌ఎస్ కోసం ముసాయిదా పథకం సిద్ధం చేసి బోర్డు అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు పీటీఐ వర్గాలు తెలిపాయి.

ప్రతిపాదిత పథకం 'సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వీఆర్ఎస్-2020'  పేరుతో ఒక డ్రాఫ్ట్ సిద్ధం చేసిందనీ, బోర్డు ఆమోదం అనంతరం ఆచరణకు సిద్ధమవుతోందన్న ఆందోళన బ్యాంకు వర్గాల్లో నెలకొంది. డిసెంబర్‌ 1న ప్రారంభమై, ఫిబ్రవరి వరకు  మాత్రమే అర్హులైన వారినుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. కటాఫ్‌ తేదీ నాటికి 25 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయస్సు నిండిన పర్మినెంట్‌ ఆఫీసర్లు, సిబ్బందికి ఇది వర్తిస్తుంది. మొత్తం 11,565 మంది అధికారులు,18,625 మంది సిబ్బంది వీఆర్‌ఎస్‌కు అర్హులు. వారిలో 30 శాతం మంది ముందుకొస్తారని అంచనా. తద్వారా  సుమారు 2,170 కోట్ల రూపాయలను ఆదా చేయాలని బ్యాంక్ ఆశిస్తోంది.

పరిహారం, ప్రయోజనాలు
విఆర్ఎస్ కింద పదవీ విరమణ ఎంచుకున్నసిబ్బందికి మిగిలిన 18 నెలల చివరి వేతనానికి లోబడి, మిగిలిన  కాలానికి (సూపరన్యుయేషన్ తేదీ వరకు) 50 శాతం జీతం చెల్లించాలి. వీఆర్‌ఎస్‌ను ఎంచుకునే ఉద్యోగులకు గ్రాట్యుటీ, పెన్షన్, ప్రావిడెంట్, మెడికల్ బెనిఫిట్స్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందించనుంది. ఈ పథకం కింద పదవీ విరమణ చేసిన సిబ్బంది పదవీ విరమణ చేసిన తేదీ నుండి రెండేళ్ల కూలింగ్ ఆఫ్ కాలం తర్వాత బ్యాంకులో తిరిగి ఉద్యోగం పొందటానికి, లేదా సర్వీసులు అందించేందుకు అర్హులు. కాగా ఎస్‌బీఐ 2020 మార్చి చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.49 లక్షలు. గత ఏడాది  ఇదే కాలంలో వీరి సంఖ్య 257,000.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement