న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ స్కూటర్ల రెంటల్ స్టార్టప్ సంస్థ బౌన్స్ కొత్తగా ఈ–స్కూటర్ల తయారీ, బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. వచ్చే 12 నెలల్లో ఇందుకు సంబంధించి 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 742 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో వివేకానంద హలికెరె ఈ విషయాలు తెలిపారు.
రెండు వేరియంట్స్
ఈ నెలాఖరు నాటికి తమ తొలి స్కూటర్‌ను రెండు వేరియంట్స్‌లో ఆవిష్కరిస్తామని, ఆ తర్వాత ప్రీ–బుకింగ్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి డెలివరీ మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రీ–బుకింగ్‌లో సుమారు ఒక లక్ష పైగా వాహనాలకు ఆర్డర్లు రావచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించారు. బ్యాటరీతో కలిపి వాహనం ధర రూ. 70,000 లోపు, బ్యాటరీ లేకుండా సుమారు రూ. 50,000 లోపు రేటు నిర్ణయించే అవకాశం ఉందని వివేకానంద చెప్పారు.
బ్యాటరీ లేకుండా
బ్యాటరీతో పాటు తీసుకుంటే పోర్టల్ చార్జర్ ద్వారా ఇంటి వద్దే చార్జింగ్ చేసుకునే వీలు ఉంటుందన్నారు. అదే బ్యాటరీ లేని వేరియంట్ తీసుకుంటే.. బ్యాటరీస్ యాజ్ ఎ సర్వీస్ విధానంలో తాము నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్లలో బ్యాటరీ మార్పిడి చేసుకోవచ్చని వివేకానంద చెప్పారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, పుణె తదితర ఆరు నగరాల్లో బ్యాటరీ మార్పి స్టేషన్లు విస్తరిస్తామన్నారు.
రాజస్థాన్‌లో ప్లాంటు
తొలి దశలో రాజస్థాన్‌లోని భివాడీలో ఉన్న తమ ప్లాంటులో వాహనాలు ఉత్పత్తి చేయనున్నామని, తదుపరి రెండో లొకేషన్ కోసం అన్వేషిస్తున్నామని వివేకానంద తెలిపారు. భివాడీ ప్లాంటు వార్షిక సామర్థ్యం 1.8 లక్షల స్కూటర్లుగా ఉంటుందని, దీని ద్వారా వచ్చే 3–4 నెలల్లో సుమారు 1,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించగలవన్నారు. ప్రస్తుతం ఈ యూనిట్‌లో 100 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. వచ్చే ఏడాది వ్యవధిలో ఈ ప్లాంటుపై సుమారు 25 మిలియన్ డాలర్లు, బ్యాటరీ మార్పిడి స్టేషన్లపై 50–75 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేస్తామని వివేకానంద వివరించారు.
చదవండి:టెస్లా బ్యాటరీతో.. ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇప్పుడు ఇండియాలో
Comments
Please login to add a commentAdd a comment