న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో సప్లై చైన్ కంపెనీ డెల్హివరీ, నగదు లాజిస్టిక్స్ కంపెనీ రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ వెరండా లెర్నింగ్ సొల్యూషన్స్ చోటు చేసుకున్నాయి.
డెల్హివరీ..
సప్లై చైన్ కంపెనీ డెల్హివరీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 7,460 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగం గా కంపెనీ రూ. 5,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,460 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని కార్లయిల్ గ్రూప్, సాఫ్ట్‌బ్యాంక్‌తోపాటు కంపెనీ సహవ్యవస్థాపకులు ఆఫర్ చేయనున్నారు. కంపెనీ 2021 నవంబర్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. ప్రధానంగా కార్లయిల్ గ్రూప్ రూ. 920 కోట్లు, సాఫ్ట్‌బ్యాంక్ రూ. 750 కోట్లు విలువైన షేర్లను విక్రయించనున్నాయి.
రేడియంట్ క్యాష్
క్యాష్ లాజిస్టిక్స్ సంస్థ రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకి సెబీ క్లియరెన్స్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 3 కోట్ల షేర్లను ప్రమోటర్ డేవిడ్ దేవసహాయం, పీఈ సంస్థ ఎసెంట్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఆఫర్ చేయనున్నాయి. 2021 అక్టోబర్‌లో కంపెనీ సెబీకి దరఖాస్తు చేసింది. రేడియంట్‌లో ఎసెంట్ 37.2 శాతం వాటాను 2015లో కొనుగోలు చేసింది.
వెరండా లెర్నింగ్
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ వెరండా లెర్నింగ్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి సెబీ ఓకే చెప్పింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. నిధులను రుణ చెల్లింపులు, ఎడ్యురెకా కొనుగోలు అవసరాలు, వృద్ధి అవకాశాలకు వినియోగించనుంది. కంపెనీ 360 డిగ్రీ సమీకృత ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌గా సర్వీసులు సమకూర్చుతోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ హైబ్రిడ్, ఆఫ్‌లైన్ బ్లెండెడ్ విధానాల్లో సేవలందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment