ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ అమ్మకాల ఒత్తిడి కొనసాగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. క్రూడాయిల్ ధరల పెరుగుదల, యూఎస్ డాలర్ ఇండెక్స్ బలపడటం, బాండ్లపై అధిక దిగుబడులతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచవచ్చంటున్నారు. ఫ్యూచర్ ఆప్షన్ డెరివేటివ్‌ల ముగింపు గురువారం కావడంతో ఒడుదుడుకులు కొనసాగొచ్చు.
ఎఫ్‌అండ్‌ఓ ముగింపు మినహా దేశీయంగా ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలేవీ లేనందున ప్రపంచ మార్కెట్ల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదిలికలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలింవచ్చంటున్నారు. ‘‘అమెరికా ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరింత కాలం గరిష్ట స్థాయిలో కొనసాగించే అవకాశం ఉన్నందున ఈక్విటీలపై రిస్క్ తీసుకొనే సామర్ధ్యం తగ్గింది. మార్కెట్లో బలహీనతలున్నందున, ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాలు, లార్జ్ క్యాప్ షేర్లలో పెట్టుబడులు ఉత్తమం.
నిఫ్టీ గతవారం కీలక మద్దతు 19,850–19,900 శ్రేణిని కోల్పోయి, 19,674 స్థాయి వద్ద స్థిరపడింది. తదుపరి మద్దతు 19,500–19,400 పాయింట్ల పరిధిలో ఉంది’’ అని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ఫెడ్ రిజర్వ్ కఠిన ద్రవ్య విధాన వైఖరి అమలు వ్యాఖ్యలు, ఎఫ్‌ఐఐల నిరంతర విక్రయాలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తదితర అధిక వెయిటేజీ షేర్లలో దిద్దుబాటు, బలహీన ప్రపంచ సంకేతాల పరిణామాల నేపథ్యంలో గతవారం స్టాక్ సూచీలు దాదాపు 3% క్షీణించాయి. సెన్సెక్స్ 1830 పాయింట్లు, నిఫ్టీ 518 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
ప్రపంచ పరిణామాలు
అమెరికా గృహ అమ్మకాల డేటా మంగళవారం విడుదల కానున్నాయి. యూరోజోన్ ఈసీబీ పాలసీ మినిట్స్ బుధవారం, అదే రోజున చైనా పారిశ్రామికోత్పత్తి, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ సమావేశం జరగనుంది. అమెరికా రెండో త్రైమాసిక వృద్ధి గణాంకాలు, ఈసీజీ సర్వసభ్య సమావేశం, చైనా కరెంట్ ఖాతా గురువారం వెల్లడి కానున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రసంగం ఉంది.
గురువారం ఎఫ్‌అండ్‌ఓ ముగింపు
ఈ గురువారం సెపె్టంబర్ సీరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్(ఎఫ్‌అండ్‌ఓ) డెరివేటివ్‌ల ముగింపు జరగనుంది. ఒకవేళ నిఫ్టీ ఈ సిరీస్‌ను నష్టాలతో ముగిస్తే వరుసగా రెండో వారమూ నష్టాల ముగింపు అవుతుంది. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌ఐఐల లాంగ్ ఎక్స్‌పోజర్ 47% తగ్గింది. పుట్–కాల్ రేషియో 0.93 ఓవర్‌సోల్డ్ జోన్ వైపు కదలుతోంది.
మూడు వారాల్లో రూ.10 వేల కోట్లు వెనక్కి
భారత ఈక్విటీలను విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. మన మార్కెట్ల నుంచి ఈ సెప్టెంబర్ తొలి మూడు వారాల్లో ఎఫ్‌ఐఐలు రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అమెరికాలో ఈసారి వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు, మాంద్యం భయాలు, దేశీయంగా కంపెనీల షేర్లు ప్రీమియంలో ఉండటం వంటి అంశాలు అమ్మకాలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అమెరికా బాండ్లపై అధిక దిగుబడులు, డాలర్ ఇండెక్స్ బలపడటంతో రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కొనసాగొచ్చంటున్నారు. గడిచిన ఆరు నెలల్లో మార్చి నుంచి ఆగష్టు మధ్య ఎఫ్‌పీఐలు వరుసగా కొనుగోళ్లను కొనసాగించారు. ఈ మధ్యకాలంలో మొత్తం రూ. 1.74 లక్షల కోట్లను విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. ‘‘భారత ఆర్థిక వృద్ధిలో అవకాశాలు, షేర్లు ఆకర్షణీయంగా ఉండటం, ప్రభుత్వ సంస్కరణలు విదేశీ పెట్టుబడులకు మద్దతిస్తున్నాయి. ఇటీవల కొంత అమ్మకాల ధోరణి కనిపించినప్పటికీ వచ్చే నెలలో విదేశీ పెట్టుబడులు తిరిగి ఈక్విటీల్లోకి వస్తాయి’’ క్రేవింగ్ ఆల్ఫా మేనేజర్ మయాంక్ మెహ్రా విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ వారంలో మూడు ఐపీఓలు
సెకండరీ మార్కెట్ అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న తరుణంలో ప్రాథమిక స్ట్రీట్ జోరు కనబరుస్తుంది. జేఎస్‌డబ్ల్యూ ఇ్రన్ఫాస్ట్రక్చర్, అప్‌డేటర్ సరీ్వసెస్ ఐపీఓలు ఈ నెల 25–27 తేదీల మధ్య జరగనున్నాయి. వాలియంట్ ల్యాబొరేటరీస్ పబ్లిక్ ఇష్యూ సెపె్టంబర్ 27న మొదలవుతుంది. కాగా గతవారంలో ప్రారంభమైన వైభవ్ జువెలర్స్ సెప్టెంబర్ 26న ముగిస్తుంది. వీటితో పాటు మరో 13 చిన్న, మధ్య తరహా కంపెనీలు మొత్తం రూ.4,000 కోట్లు సమీకరించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment