
ముంబై: వరుసగా అయిదో రోజూ కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీల రికార్డు ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు, క్రూడాయిల్ ధరలు దిగిరావడం వంటి అంశాలు కలిసొచ్చాయి. ఫలితంగా స్టాక్ సూచీలు ఈ ఏడాది(2023) చివరి ఎఫ్‌అండ్‌ఓ గడువు ముగింపు రోజైన గురువారం మరోసారి ఇంట్రాడే, ముగింపుల్లో చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి.
సెన్సెక్స్ 372 పాయింట్లు పెరిగి 72,410వద్ద స్థిరపడింది. నిఫ్టీ 124 పాయింట్లు లాభపడి 21,777 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో కొంత అమ్మకాల ఒత్తిడికి లోనైనప్పట్టకీ.., తిరిగి పుంజుకోగలిగాయి.
అయిల్‌అండ్‌గ్యాస్, ఇంధన, మెటల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించడంతో ఒక దశలో సెన్సెక్స్ 446 పాయింట్లు బలపడి 72,484 వద్ద, నిఫ్టీ 147 పాయింట్లు దూసుకెళ్లి 21,801 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. పారిశ్రామిక, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.66%, 0.23% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.4359 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.137 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్ 5 రోజుల్లో 1,904 పాయింట్ల లాభంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో లిస్టెడ్ సంస్థల మార్కెట్ విలువ రూ.12.80 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి రూ.363 లక్షల కోట్లకు చేరింది. గురువారం ఒక్కరోజే రూ.1.7 లక్షల కోట్లు పెరిగింది.
కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెవలరీ ఫీజుపై జీఎస్‌టీకి సంబంధించి రూ.402 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ డీజీజీఐ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో జొమాటో షేరు 3% నష్టపోయి రూ.123 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పతనమై రూ.121 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.
హౌసింగ్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌కు సంబంధించి గుజరాత్ ప్రభుత్వంతో రూ. 14,500 కోట్ల ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకోవడంతో ప్రభుత్వ రంగ హడ్కో షేరు 12% పెరిగి రూ.128 వద్ద ముగిసింది.
దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు రావడం, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో డాలర్ మారకంలో రూపాయి గురువారం 17 పైసలు పెరిగి 83.17 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment