
ముంబై: మిడ్‌సెషన్ నుంచి ఆర్థిక, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు వారం ప్రారంభంలోనే లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 125 పాయింట్ల లాభంతో 54,403 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 16,258 వద్ద ముగిసింది. ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా, మీడియా షేర్లూ స్వల్పంగా లాభపడ్డాయి. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్స్, రియలీ్ట, ఆయిల్‌అండ్‌గ్యాస్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 460 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 142 పాయింట్ల శ్రేణిలో కదలాడాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు ఒకశాతానికిపైగా నష్టపోయాయి. అయితే లార్జ్‌క్యాప్ షేర్లు రాణించి సూచీలకు అండగా నిలిచాయి. డెల్టా కేసుల పెరుగుదల భయాలు, కమోడిటీ ధరల పతనంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ నాలుగు గరిష్టానికి చేరుకుంది. ఫలితంగా డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు పతమైన 74.26 వద్ద ముగిసింది.
ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా...
దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంతో 54,386 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 16,281 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆస్తకి చూపడంతో మార్కెట్ మొదలైన అరగంటకే సెన్సెక్స్ 312 పాయింట్లు ఎగసి 54,585 వద్ద, నిఫ్టీ 83 పాయింట్లు ర్యాలీ చేసి 16,321 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి.
రోలెక్స్ రింగ్స్ లిస్టింగ్ సూపర్...
ఆటో విడిభాగాల తయారీ సంస్థ రోలెక్స్ రింగ్స్ ఐపీఓ లిస్టింగ్‌లో అదరగొట్టాయి. ఇష్యూ ధర రూ.900తో పోలిస్తే ఈ షేరు బీఎస్‌ఈలో 39% ప్రీమియంతో రూ.1250 వద్ద లిస్ట్ అయింది. ఒకదశలో 40% లాభపడి రూ.1263 వద్ద గరిష్టాన్ని అందుకుంది. చివరికి 30% లా భంతో రూ.1167 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,176.90 కోట్లుగా ఉంది.
అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులు!
ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ ద్వారా సాకారం
న్యూఢిల్లీ: ఎంపిక చేసిన అమెరికన్ స్టాక్స్‌లో ట్రేడింగ్ చేసే సదుపాయాన్ని తమ ప్లాట్‌ఫాం ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ఇంటర్నేషనల్ ఎక్సే్చంజీ (ఐఎఫ్‌ఎస్‌సీ) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ పెట్టుబడి సాధనాన్ని దేశీ ఇన్వెస్టర్లకు అందించే దిశగా డిపాజిటరీలు, బ్యాంకులు, బ్రోకర్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొంది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ (గిఫ్ట్ సిటీ)లో తీసుకున్న డీమ్యాట్ ఖాతాల్లో వీటిని హోల్డ్ చేయొచ్చని పేర్కొంది. ఈ విధానంతో దేశీ రిటైల్ ఇన్వెస్టర్లకు అమెరికన్ స్టాక్స్ లభించగలవని ఎన్‌ఎస్‌ఈ ఎండీ విక్రమ్ లిమాయే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment