
ముంబై: ఐటీ, టెక్, మెటల్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు రెండోరోజూ నష్టాలు చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలూ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
సెన్సెక్స్ ఉదయం 125 పాయింట్ల నష్టంతో 65,026 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 396 పాయింట్లు పతనమై 64,755 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో కొంతమేర నష్టాలు భర్తీ చేసుకుంది. చివరికి 202 పాయింట్లు క్షీణించి 64,948 వద్ద స్థిరపడింది. నిఫ్టీ రోజంతా 19,254 – 19,365 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 55 పాయింట్ల నష్టపోయి 19,310 వద్ద నిలిచింది.
ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ప్రభుత్వరంగ రంగ బ్యాంకులు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.267 ఈక్విటీ షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.339 కోట్ల షేర్లను కొన్నారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 374 పాయింట్లు, నిఫ్టీ 118 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
►అమెరికాలో టెక్నాలజీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నాస్‌డాక్ సూచీ పతన ప్రభావం దేశీయ ఐటీ షేర్లపై పడింది. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో షేర్లు 2 నుంచి 1.50% పతనమయ్యాయి.
►ఆరంభ నష్టాలను భర్తీ చేసుకున్న అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఒకశాతం లాభపడి రూ. 2,557 వద్ద స్థిరపడింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు సోమవారం లిస్టింగ్ అవుతున్నట్లు కంపెనీ చేసిన ప్రకటనతో ఈ షేరుకు డిమాండ్ లభించింది.
►నష్టాల మార్కెట్లోనూ కాంకర్డ్ బయోటెక్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర(రూ.741)తో పోలిస్తే బీఎస్‌ఈలో 21% ప్రీమియంతో రూ.900 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 33% దూసుకెళ్లి రూ.987 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 27% లాభంతో రూ.942 వద్ద స్థిరపడింది. కంపెనీ విలువ రూ.9,853 కోట్లుగా నమోదైంది.
►4 ప్రాంతీయ చానెల్స్ లాంచ్‌కు సమాచార, ప్రసార శాఖ ఆమోదం తెలపడంతో ఎన్‌డీటీవీ షేరు 2% లాభపడి రూ.225 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 5% బలపడి రూ.232 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.