ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూలతలు, ఉపశమించిన ద్రవ్యోల్బణం నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ దూకుడు చూపాయి. సెన్సెక్స్ 318 పాయింట్లు జంప్‌చేసి 62,346కు చేరింది. నిఫ్టీ 84 పాయింట్లు ఎగసి 18,399 వద్ద నిలిచింది. వెరసి గతేడాది డిసెంబర్ 14 తర్వాత తిరిగి మార్కెట్లు గరిష్టాలకు చేరాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్ల ప్రోత్సాహానికితోడు.. ఏప్రిల్‌లో టోకు ధరలు మైనస్‌కు చేరడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా జోరందుకున్నాయి. సెన్సెక్స్ 535 పాయింట్లు పురోగమించి 62,563కు చేరింది. నిఫ్టీ 18,459ను తాకింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సైతం సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
రియల్టీ దూకుడు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడగా.. రియల్టీ 4.3 శాతం జంప్‌చేసింది. రిటైల్, టోకు ధరలు తగ్గడంతో వడ్డీ రేట్లకు చెక్ పడనున్న అంచనాలు ఇందుకు దోహదపడినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. మీడియా, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ 2–0.7 శాతం లాభపడ్డాయి. ఆయిల్ అండ్ గ్యాస్ యథాతథంగా నిలిచింది. రియల్టీ కౌంటర్లలో శోభా 11.5 శాతం దూసుకెళ్లగా.. డీఎల్‌ఎఫ్, మహీంద్రా లైఫ్, ప్రెస్జీజ్ ఎస్టేట్స్, ఒబెరాయ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, లోధా 7.4–3.4 శాతం మధ్య జంప్ చేశాయి.
టాటా మోటార్స్ జోరు
నిఫ్టీ దిగ్గజాలలో హీరోమోటో, టాటా మోటార్స్ 3 శాతం పుంజుకోగా.. ఐటీసీ, టెక్ మహీంద్రా, హిందాల్కో, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్, టాటా స్టీల్, విప్రో, ఐషర్, ఎస్‌బీఐ, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2–0.6 శాతం మధ్య బలపడ్డాయి. అయితే అదానీ ఎంటర్, సిప్లా, బీపీసీఎల్, గ్రాసిమ్, దివీస్ ల్యాబ్, మారుతీ, అదానీ పోర్ట్స్, టీసీఎస్ 3–0.7 శాతం మధ్య నీరసించాయి.
చిన్న షేర్లు ఓకే
మార్కెట్ల బాటలో చిన్న షేర్లకూ డిమాండ్ కనిపించింది. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,856 లాభపడితే, 1,802 డీలాపడ్డాయి. నగదు విభాగంలో వారాంతాన రూ. 1,014 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) సోమవారం మరింత అధికంగా రూ. 1,685 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే దేశీ ఫండ్స్ రూ. 191 కోట్ల విలువైన స్టాక్స్ మాత్రమే కొనుగోలు చేశాయి. ఈ నెల తొలి రెండు వారాలలో ఎఫ్‌పీఐలు రూ. 23,152 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! విదేశీ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు బ్యారల్ 0.25 శాతం బలపడి 74.34 డాలర్లకు చేరింది. డాలరుతో మారకంలో రూపాయి 13 పైసలు నీరసించి 82.31కు చేరింది.
సెన్సెక్స్, బ్యాంకెక్స్ డెరివేటివ్‌లు మళ్లీ ప్రారంభం
స్టాక్ ఎక్సే్చంజీ బీఎస్‌ఈ తాజాగా సెన్సెక్స్, బ్యాంకెక్స్ డెరివేటివ్‌లను సోమవారం పునఃప్రారంభించింది. ఈ కాంట్రాక్టులకు సంబంధించిన ఫ్యూచర్స్, ఆప్షన్స్ లాట్ సైజును తగ్గించడంతో పాటు ఎక్స్‌పైరీ రోజును కూడా గురువారం నుంచి శుక్రవారానికి మార్చినట్లు సంస్థ ఎండీ సుందరరామన్ రామమూర్తి ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం.. సెన్సెక్స్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ లాట్ సైజు 15 నుంచి 10కి, బ్యాంకెక్స్ లాట్ సైజును 20 నుంచి 15కి తగ్గించారు. అధిక రాబడులిచ్చేందుకు ఆస్కారమున్న అత్యంత రిస్కీ సాధనాలుగా డెరివేటివ్స్‌ను పరిగణిస్తారు. 2000లో బీఎస్‌ఈ తొలిసారిగా సెన్సెక్స్–30 డెరివేటివ్స్ (ఆప్షన్స్, ఫ్యూచర్స్)ను ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment