ముంబై: కార్పొరేట్ల మూడో క్వార్టర్ ఆర్థిక గణాంకాలు మెప్పించవచ్చనే ఆశలతో స్టాక్ సూచీల ర్యాలీ నాలుగోరోజూ కొనసాగింది. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం సెంటిమెంట్‌ను మరింత మెరుగుపరిచింది. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందగా., ఇన్వెస్టర్లు కోవిడ్ కేసుల భయాలను విస్మరిస్తూ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 533 పాయింట్లు పెరిగి 61,150 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 157 పాయింట్లు లాభపడి 18,212 వద్ద నిలిచింది. ఒక్క ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
మెటల్, రియల్టీ, ఆటో షేర్లు అధిక కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 601 పాయింట్లు పెరిగి 60,616 వద్ద, నిఫ్టీ 172 పాయింట్లు ఎగసి 18,228 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతుతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు ఒకశాతానికి పైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,002 కోట్ల షేర్లను అమ్మేయగా.., దేశీయ ఇన్వెస్టర్లు రూ.1132 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఒకపైసా బలపడి 73.93 వద్ద స్థిరపడింది.
ఇన్వెస్టర్ల సంపద పైపైకి..
గడచిన నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,548 పాయింట్లు లాభపడటంతో బీఎస్‌ఈ ఎక్స్చేంజిలో రూ.6.08 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.277.22 లక్షల కోట్లకు చేరింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
- వోడాఫోన్ ఐడియా షేరు బుధవారం రికవరీ అయ్యింది. బీఎస్‌ఈలో కనిష్ట స్థాయి వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 13 శాతం పెరిగి రూ.13.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి తొమ్మిది శాతం లాభంతో రూ.13 వద్ద స్థిరపడింది. ఏజీఆర్ బకాయిలకు బదులుగా కేంద్రానికి ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు సిద్ధమవడంతో మంగళవారం 21 శాతం నష్టపోయింది.
- టాటా టెలీ సర్వీసెస్ షేరు పతనం కొనసాగింది. బీఎస్‌ఈలో 5 శాతం నష్టపోయి రూ.276.50 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకింది.
- జేపీ మోర్గాన్ బ్రోకింగ్ సంస్థ రేటింగ్ అప్‌గ్రేడ్ చేయడంతో ఎన్‌ఎండీసీ షేరు మూడున్నర శాతం పెరిగి రూ.141 వద్ద స్థిరపడింది.
(చదవండి: భారత్ ఆర్థిక వృద్ధి రేటులో ఎలాంటి మార్పు లేదు: ప్రపంచ బ్యాంక్)
Comments
Please login to add a commentAdd a comment