న్యూఢిల్లీ: భారత్ మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం వేగం మేతో పోల్చితే జూన్‌లో కొంత మందగించింది. మేలో 61.2 వద్ద ఉన్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్, జూన్‌లో 58.5కు తగ్గింది. అయితే ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది.
ఈ ప్రాతిపదికన సూచీ 50పైన కొనసాగడం వరుసగా 23వ నెల. సూచీ తాజా సమీక్షా నెల్లో కొంత మందగించినప్పటికీ, వ్యవస్థలో డిమాండ్, కొత్త వ్యాపార పరిమాణాలు, ఉపాధి కల్పనకు సంబంధించి సానుకూల వాతావరణమే ఉన్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మార్కిట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ విభాగ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు.
తయారీ, సేవలు కలిపితే...
తయారీ, సేవల రంగాలు కలిపిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ జూన్‌లో 61.6 వద్ద ఉంటే, మేలో 59.4కు తగ్గింది. ఈ సూచీ కూడా వృద్ధి ధోరణిలోనే పటిష్టంగా ఉన్నట్లు పోలీయానా డీ లిమా తెలిపారు. భారత పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70% వాటా కలిగిన ఒక్క తయారీ రంగాన్ని చూస్తే, మేలో 31 నెలల గరిష్ట 58.7 స్థాయిని చూసిన ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ జూన్‌లో 57.8కి తగ్గింది. 400 తయారీ సంస్థల పర్చేజింగ్ మేనేజర్లకు పంపిన సమాధానాల ప్రాతిపదికన కదలికలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment