2028 మార్చి నాటికి సాధ్యమే
ప్రస్తుత విలువ రూ.5.69 లక్షల కోట్లు
నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్
న్యూఢిల్లీ: భారత ఆహార సేవల రంగం మార్కెట్ విలువ ఏటా 8.1 శాతం చొప్పున వృద్ధి చెందుతూ 2028 మార్చి నాటికి రూ.7.76 లక్షల కోట్లకు చేరుకుంటుందని జాతీయ రెస్టారెంట్స్ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) అంచనా వేసింది. ఈ ఏడాది మార్చి నాటికి ఆహార సేవల రంగం మార్కెట్ విలువ రూ.5.69 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. దేశ ఆహార సేవల రంగంపై ఒక నివేదికను విడుదల చేసింది. ఆహార సేవల్లో సంఘటిత రంగం వాటా 13.2 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని తెలిపింది.
కరోనా సంక్షోభం నుంచి ఈ రంగం బయటకు వచి్చందని పేర్కొంది. 2020 మార్చి నాటికి రూ.4.24 లక్షల కోట్లుగా ఉన్న మార్కె ట్, కరోనా దెబ్బకు 2021 మార్చి నాటికి రూ.2 లక్షల కోట్లకు తగ్గిపోవడం గమనార్హం. 2022 మార్చి నాటికి తిరిగి రూ.4.72 లక్షల కోట్లకు చేరుకోగా, 2023 మార్చి నాటికి రూ.5.3 లక్షల కోట్లు, ఈ ఏడాది మార్చి చివరికి రూ.5.69 లక్షల కోట్లకు విస్తరించినట్టు ఎన్‌ఆర్‌ఏఐ నివేదిక వెల్లడించింది. 2025 మార్చి నాటికి రూ.5.69 లక్షల కోట్లను తాకుతుందని అంచనా వేసింది.
టాప్ –3 మార్కెట్
భారత ఆహార సేవల రంగం 2028 మార్చి నాటికి జపాన్‌ను అధిగమించి, ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందని ఎన్‌ఆర్‌ఏఐ నివేదిక తెలిపింది. కరోనా ప్రతికూలతల నుంచి ఆహార సేవల మార్కెట్ వేగంగా వృద్ధి చెందిందని, ఇది ఈ రంగం బలమైన సామర్థ్యాలను తెలియజేస్తోందని ఎన్‌ఆర్‌ఏఐ ప్రెసిడెంట్ కబీర్ సూరి పేర్కొన్నారు.
సామాజికంగా, ఆర్థికంగా ఈ పరిశ్రమ చూపించే ప్రభావాలను గుర్తించి, ఈ మార్కెట్ వృద్ధికి అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఆహార సేవల రంగం ఉపాధి పరంగా రెండో అతిపెద్ద విభాగమని, 85.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని ఎన్‌ఆర్‌ఏఐ నివేదిక తెలిపింది. 2028 నాటికి ఈ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు 1.03 కోట్లకు చేరతాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఈ పరిశ్రమ నుంచి రూ.33,809 కోట్ల పన్ను ఏటా ప్రభుత్వానికి వస్తండగా, 2028 మార్చి నాటికి రూ.55,594 కోట్లకు చేరుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment