ముంబై: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి అటు ప్రజల ఆరోగ్యంతోపాటు.. ఇటు పలు ఉత్పత్తుల ధరలనూ ప్రభావితం చేస్తోంది. ఈ ఏడాది లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 100 స్థాయికి చేరి మంటపుట్టించగా.. ఇటీవల కొంతమేర దిగివచ్చినప్పటికీ వంట నూనెలు రూ. 180కు చేరి వినియోగదారులకు షాకిచ్చాయి. ఈ ప్రభావంతో కొన్నేళ్లలోలేని విధంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని మించుతూ టోకు ధరలు నవంబర్‌లో 14.23 శాతాన్ని తాకాయి. ఇక మరోపక్క రవాణా, ప్యాకేజింగ్, శ్రామిక వ్యయాలు పెరగడంతో పలు రంగాలపై ప్రతిలకూ ప్రభావం పడుతోంది. వెరసి ప్రధానంగా నిత్యావసర వస్తువుల జాబితాలోకి వచ్చే ప్రొడక్టులను విక్రయించే ఎఫ్‌ఎంసీజీ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే పలు ఎఫ్‌ఎంసీజీ ప్రొడక్టుల ధరలు 5–10 శాతం మధ్య పెరిగినట్లు తెలియజేశారు. ఈ బాటలో జనవరి నుంచి సైతం ధరలు మరోసారి హెచ్చనున్నట్లు అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం..
అదానీ, పార్లే, డాబర్ రెడీ
వచ్చే నెల నుంచి ప్యాకేజ్‌డ్ గోధుమ పిండి ధరలను 5–8 శాతం, బాస్మతి బియ్యం ధరలను 8–10 శాతం మధ్య పెంచనున్నట్లు అదానీ విల్మర్ సీఈవో అన్షు మాలిక్ తాజాగా జాతీయ మీడియాకు వెల్లడించారు. ఇటీవల ప్యాకేజింగ్ వ్యయాలు 15–18 శాతంమేర పెరిగినట్లు పేర్కొన్నారు. ఇక అక్టోబర్–డిసెంబర్‌లో ఇప్పటికే కొన్ని బిస్కెట్ ప్యాకింగుల ధరలను 5–10 శాతం మధ్య పెంచినట్లు పార్లే ప్రొడక్టస్ వెల్లడించింది. జనవరి–మార్చి మధ్య మరోసారి ధరలను 4–5 శాతంమేర హెచ్చించనున్నట్లు తెలియజేసింది. అయితే ద్రవ్యోల్బణం దిగివస్తుందని వేచిచూస్తున్నట్లు డాబర్ పేర్కొంది. ఇప్పటికే కొన్ని ఉత్పత్తుల ధరలను 3–4 శాతం మధ్య పెంచిన కంపెనీ ద్రవ్యోల్బణం తగ్గకుంటే మార్చి నుంచి మళ్లీ ప్రొడక్టుల ధరల పెంపును చేపట్టవచ్చని సంకేతమిచ్చింది. ఇటీవల 9 శాతాన్ని దాటిన ద్రవ్యోల్బణం ఆందోళనలకు తావిస్తున్నదని, ఈ ప్రభావాన్ని తట్టుకునేందుకు వ్యయనియంత్రణలను పాటిస్తున్నామని డాబర్ ఇండియా సీఈవో మోహిత్ మల్హోత్రా తెలియజేశారు.
కెవిన్‌కేర్ సైతం సై
వ్యక్తిగత సంరక్షణా ఉత్పత్తుల కంపెనీ కెవిన్‌కేర్ సైతం ద్రవ్యోల్బణం ధాటికి ధరలను పెంచకతప్పడంలేదని తెలియజేసింది. వచ్చే నెల నుంచి షాంపూలు, చర్మ సంరక్షణ ప్రొడక్టుల ధరలను 2–3 శాతం మధ్య హెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే కంపెనీ ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 3 శాతం వరకూ ఉత్పత్తుల ధరలను పెంచింది. షాంపూల విభాగంలో ప్రధానంగా నాన్‌సాచెట్స్ ప్రొడక్టుల ధరలనే పెంచనున్నట్లు కెవిన్‌కేర్ సీఈవో వెంకటేష్ విజయ రాఘవన్ పేర్కొన్నారు. కోవిడ్–19 సవాళ్లతో సరఫరాల అంతరాయాలు, తదితరాల కారణంగా గోధుమల ధరలు వార్షికంగా 20 శాతం పెరిగినట్లు పరిశ్రమరంగ నిపుణులు తెలియజేశారు. ఇక ముడిపామాయిల్ ధరలు 36 శాతంౖò జంప్‌చేసినట్లు పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గించడంతో గత 45 రోజుల్లో అదానీ విల్మర్ వంట నూనెల ధరలలో కోత పెట్టింది. సోయాబీన్ నూనెల లీటర్ ధరలను రూ. 175 నుంచి రూ. 155కు కుదించింది. ఇదేవిధంగా వంట నూనెల ధరలను సైతం రూ. 170 నుంచి రూ. 150కు దించింది.
చదవండి: వంట నూనెల ధరలు తగ్గాయ్
Comments
Please login to add a commentAdd a comment