డెల్(Dell) టెక్నాలజీస్ హైబ్రిడ్ వర్క్ పాలసీ(వారంలో కొన్ని రోజులు ఆఫీస్ నుంచి, ఇంకొన్ని రోజులు ఇంటి నుంచి పని చేసే విధానం)కి స్వస్తి చెప్పింది. డెల్ కార్యాలయం సమీపంలో అంటే ఒక గంట ప్రయాణ సమయం పట్టే పరిధిలో ఉన్న ఉద్యోగులు మార్చి 3, 2025 నుంచి వారానికి ఐదురోజులు ఆఫీస్‌కు రావాలని స్పష్టం చేసింది. ఉత్పాదకత, సృజనాత్మకతను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డెల్ సీఈఓ మైఖేల్ డెల్ ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించారు.
కొత్త విధానంతో డెల్ హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను ముగించింది. ఉద్యోగుల మధ్య పరస్పర చర్చల వల్ల సమర్థమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని కంపెనీ విశ్వసిస్తుంది. మైఖేల్ డెల్ తాను పంపిన ఈమెయిల్‌లో..‘ప్రపంచంలోని మెరుగైన అన్ని టెక్నాలజీలకు మూలం పరస్పర మానవ చర్చలే. దాంతో పనులు మరింత వేగంగా పూర్తవుతాయి’ అన్నారు. డెల్ కార్యాలయాలకు సమీపంలో గంట ప్రయాణ సమయం ఉన్న ఉద్యోగులకు కొత్త ఆదేశాలు వర్తిస్తాయి. అయితే మరింత దూరంలో నివసించే వారు రిమోట్‌గా పని చేసేందుకు సీనియర్ అధికారుల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలియజేశారు.
ఇదీ చదవండి: అనుకున్నదొకటి.. అయినదొకటి!
ఈ ప్రకటనపై డెల్ ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంతమంది పిల్లల సంరక్షణ ఏర్పాట్లు, పార్కింగ్ కొరత వంటి లాజిస్టిక్ సవాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును అందించాయి. క్రమంగా దాన్ని తొలగించి రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, ఏటీ అండ్ టీ, జేపీ మోర్గాన్ వంటి సంస్థలు కూడా ఇటీవల ఇలాంటి విధానాలను అమలు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment