ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి (Infosys founder NR Narayana Murthy) ‘వారానికి 70 గంటల పని’ వ్యాఖ్యల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. అసలే పని ఒత్తిడితో సతమతమవుతూ కుటుంబ జీవితాన్ని ఆస్వాదించలేకపోతుంటే మళ్లీ అధిక పని గంటల సలహాలేంటని చాలా మంది ఉద్యోగులు కస్సుమంటున్నారు. ఇక వ్యాపారాధినేతలు, కంపెనీల ప్రముఖలలో కొందరు ఈ సలహాను సమర్థిస్తుంటే మరికొంత మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు.
అలా నారాయణమూర్తి ‘70 గంటల పని’ భావనను వ్యతిరేకిస్తున్నవారిలో తాజాగా మరో ప్రముఖురాలు చేరారు. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (PMS) కంపెనీ ఫస్ట్‌గ్లోబల్‌గ్రూప్ ఫౌండర్, చైర్‌పర్సన్, ఎండీ దేవినా మెహ్రా (Devina Mehra) ‘వారానికి 70 గంటల పని’ భావనను తప్పుపట్టారు. సుదీర్ఘ పని గంటల వల్ల ఉత్పాదకత పెరుగుతుందని ఆమె విశ్వసించడం లేదు. అంతేకాదు ఈ సలహాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు కూడా.
అది వెర్రితనం
‘వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉత్పాదకత తగ్గుతుంది. ఇది ప్రపంచమంతటికీ బాగా తెలుసు. కాబట్టి వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పడం వెర్రితనం అవుతుంది. నా ఉద్దేశంలో ఈ భావన పనికిరాదు’ అని చెప్పారు దేవినా మెహ్రా.
వారానికి 70 గంటలు పనికే కేటాయిస్తే వాళ్లు ఇతర బాధ్యతలను ఏం నిర్వర్తించగలరని ఆమె పశ్నించారు. వర్క్‌ఫోర్స్‌లో చాలా మంది మహిళలకు వర్క్‌తోపాటు ఇతర బాధ్యతలూ ఉంటాయని, సుదీర్ఘ పని గంటల వాతావరణంలో అలాంటి మహిళలు పని చేయలేరని మెహ్రా వివరించారు.
యువత ఆఫీస్‌లో అత్యధిక సమయాన్ని వెచ్చించాల్సిన పనిలేదని, అయితే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఒక యజమానిగా తాను అవుట్‌పుట్‌పై దృష్టి పెడతాను కానీ, పని గంటల సంఖ్యపై కాదని ఆమె స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment