
ప్రముఖ దిగ్గజ కార్ల కంపెనీ స్కోడా రాబోయే దశాబ్దానికి తన సరికొత్త- స్కోడా ఆటో స్ట్రాటజీ 2030 ను ప్రకటించింది. ఈ వ్యూహంతో మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ వాహనాలు త్వరగా రావడానికి కీలక పాత్ర పోషించనుంది. చెక్ కార్ల తయారీదారు స్కోడా 2030 నాటికి కనీసం మూడు ఎలక్ట్రిక్ కారు మోడళ్లను రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ కార్లు స్కోడా ENYAQ iV సిరీస్‌కు తదనంతర కారు మోడళ్లగా నిలుస్తాయని కంపెనీ తెలిపింది.
స్కోడా తన కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు ENYAQ iVను గత సంవత్సరం సెప్టెంబర్‌లో కారు టీజర్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం స్కోడా ENYAQ iV కార్ల ఉత్పత్తి వేగంగా జరుగుతుంది. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని యూరోప్‌లో 50 నుంచి 70 శాతం మధ్య పూర్తి ఎలక్ట్రిక్ మోడళ్ల వాటాను స్కోడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎలక్ట్రిక్ కార్లు సుమారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 340కి.మీ. నుంచి 510 కి.మీ వచ్చేలా బ్యాటరీలను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్నఅగ్రశ్రేణి ఎలక్ట్రిక్ కార్ల తయారీదారులకు పోటీగా ప్రజలకు సరసమైన ధరలకే అందించాలని స్కోడా భావిస్తోంది. అంతేకాకుండా స్కోడా ఎలక్ట్రిక్ కార్ల కోసం సొంత ఛార్జింగ్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఐరోపాలో 2030లోపు సుమారు 2,10,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. స్కోడా తొలుత ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో ప్రవేశ పెట్టకూడదని భావించినా, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌పై దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ కార్లను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆటోమోబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు.
చదవండి: మార్కెట్‌లోకి స్కోడా ఆక్టావియా ఫోర్త్ జనరేషన్ కారు