ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్ పురోగమించడంతో ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్ సైతం చరిత్రాత్మక గరిష్టానికి చేరువైంది. బుధవారం ఇంట్రాడేలో ఈ స్థాయిని అందుకున్నప్పటికీ చివరికి 6 పాయింట్ల దూరంలో నిలిచింది. వెరసి బుధవారం ఎస్‌అండ్‌పీ ఇండెక్స్ 45 పాయింట్లు(1.4 శాతం) పెరిగి 3,380 వద్ద ముగిసింది. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్‌అండ్‌పీ 3,386 వద్ద నిలవడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసుకుంది. కాగా.. జూన్‌లోనే ఫిబ్రవరి గరిష్టాలను దాటిన నాస్‌డాక్ ఇటీవల వెనకడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం 229 పాయింట్లు(2.1 శాతం) జంప్‌చేసి 11,012 వద్ద స్థిరపడింది. తద్వారా ఇంతక్రితం సాధించిన కొత్త రికార్డు 11,108కు చేరువలో ముగిసింది. ఈ బాటలో డోజోన్స్ సైతం 290 పాయింట్లు(1.1 శాతం) లాభపడి 27,977 వద్ద స్థిరపడింది.
జోరు తీరిలా
బుధవారం ట్రేడింగ్‌లో టెక్నాలజీ, ఈకామర్స్, సోషల్ మీడియా దిగ్గజాలకు డిమాండ్ పెరిగింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్ 3.3-1.5 శాతం మధ్య ఎగశాయి. దీంతో మార్కెట్లకు జోష్ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్ 5:1 నిష్పత్తిలో షేర్ల విభజనకు ప్రతిపాదించింది. దీంతో ఈ షేరు 13 శాతంపైగా దూసుకెళ్లింది. ఇతర కౌంటర్లలో టీమొబైల్, షెవ్రాన్ కార్పొరేషన్ 1.5 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే రాయల్ కరిబియన్ 2.5 శాతం, ఉబర్ టెక్నాలజీస్ 1.2 శాతం చొప్పున క్షీణించాయి.
ఆసియా ప్లస్‌లో
బుధవారం యూరోపియన్ మార్కెట్లు సైతం 1-2 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. జపాన్, సింగపూర్, కొరియా, థాయ్‌లాండ్, తైవాన్ 2-0.6 శాతం మధ్య ఎగశాయి. హాంకాంగ్ 0.4 శాతం క్షీణించగా.. ఇండొనేసియా స్వల్పంగా బలపడింది. చైనా యథాతథంగా కదులుతోంది.
Comments
Please login to add a commentAdd a comment