S&P 500 Stock Index
-
యాపిల్ వండర్- యూఎస్ భళా
వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు రికార్డులతో బలపడ్డాయి. ఎస్అండ్పీ 12 పాయింట్లు(0.35 శాతం) పుంజుకుని 3,397 వద్ద నిలవగా.. నాస్డాక్ 47 పాయింట్లు(0.45 శాతం) ఎగసి 11,312 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. డోజోన్స్ 191 పాయింట్లు(0.7 శాతం) పెరిగి వద్ద స్థిరపడింది. తయారీ, సర్వీసుల రంగాల దన్నుతో జులైలో బిజినెస్ యాక్టివిటీ 2019 ఆగస్ట్ స్థాయిలో పుంజుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. మరోపక్క వరుసగా రెండో నెలలోనూ గృహ విక్రయాలు జోరందుకున్నాయి. దీంతో ఇళ్ల ధరలు రికార్డ్ స్థాయికి చేరినట్లు రియల్టీ సంస్థలు తెలియజేశాయి. దీంతో వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. లాక్‌డవున్‌ల తదుపరి ఆర్థిక వ్యవస్థలో రికవరీ కనిపించడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించిందని తద్వారా సెంటిమెంటు బలపడిందని నిపుణులు పేర్కొన్నారు. 497 డాలర్లకు యాపిల్ శుక్రవారం ట్రేడింగ్‌లో యాపిల్ షేరు 5 శాతం జంప్‌చేసి 497 డాలర్లకు ఎగువన ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 2.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది అమెరికన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డుకాగా.. ఇతర టెక్ దిగ్గజాలు మైక్రొసాఫ్ట్, గూగుల్, ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ డీలా పడ్డాయి. ఇతర కౌంటర్లలో వ్యవసాయ పరికరాల కంపెనీ డీరె అండ్ కంపెనీ షేరు 4.4 శాతం జంప్‌చేసింది. 200 డాలర్ల సమీపంలో నిలిచింది. 2020 ఏడాదిలో ఆకర్షణీయ పనితీరు చూపే వీలున్నట్లు కంపెనీ వేసిన అంచనాలు ఇందుకు సహకరించాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇంక్ షేరు 2.4 శాతం బలపడింది. 2050 డాలర్ల సమీపంలో ముగిసింది. తద్వారా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 382 బిలియన్ డాలర్లను దాటింది. తద్వారా ఆటో రంగంలో అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆసియా లాభాల్లో యూఎస్ మార్కెట్ల ప్రోత్సాహంతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి నెలకొంది. హాంకాంగ్, కొరియా, జపాన్, తైవాన్, సింగపూర్, థాయ్‌లాండ్ 1.5-0.3 శాతం మధ్య ఎగశాయి. ఇతర మార్కెట్లలో చైనా, ఇండోనేసియా స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. -
ఎస్అండ్పీ- నాస్డాక్.. పోటాపోటీ
ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్ పురోగమించడంతో ఎస్అండ్పీ-500 ఇండెక్స్ సైతం చరిత్రాత్మక గరిష్టానికి చేరువైంది. బుధవారం ఇంట్రాడేలో ఈ స్థాయిని అందుకున్నప్పటికీ చివరికి 6 పాయింట్ల దూరంలో నిలిచింది. వెరసి బుధవారం ఎస్అండ్పీ ఇండెక్స్ 45 పాయింట్లు(1.4 శాతం) పెరిగి 3,380 వద్ద ముగిసింది. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్అండ్పీ 3,386 వద్ద నిలవడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసుకుంది. కాగా.. జూన్‌లోనే ఫిబ్రవరి గరిష్టాలను దాటిన నాస్డాక్ ఇటీవల వెనకడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం 229 పాయింట్లు(2.1 శాతం) జంప్‌చేసి 11,012 వద్ద స్థిరపడింది. తద్వారా ఇంతక్రితం సాధించిన కొత్త రికార్డు 11,108కు చేరువలో ముగిసింది. ఈ బాటలో డోజోన్స్ సైతం 290 పాయింట్లు(1.1 శాతం) లాభపడి 27,977 వద్ద స్థిరపడింది. జోరు తీరిలా బుధవారం ట్రేడింగ్‌లో టెక్నాలజీ, ఈకామర్స్, సోషల్ మీడియా దిగ్గజాలకు డిమాండ్ పెరిగింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్ 3.3-1.5 శాతం మధ్య ఎగశాయి. దీంతో మార్కెట్లకు జోష్ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్ 5:1 నిష్పత్తిలో షేర్ల విభజనకు ప్రతిపాదించింది. దీంతో ఈ షేరు 13 శాతంపైగా దూసుకెళ్లింది. ఇతర కౌంటర్లలో టీమొబైల్, షెవ్రాన్ కార్పొరేషన్ 1.5 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే రాయల్ కరిబియన్ 2.5 శాతం, ఉబర్ టెక్నాలజీస్ 1.2 శాతం చొప్పున క్షీణించాయి. ఆసియా ప్లస్‌లో బుధవారం యూరోపియన్ మార్కెట్లు సైతం 1-2 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. జపాన్, సింగపూర్, కొరియా, థాయ్‌లాండ్, తైవాన్ 2-0.6 శాతం మధ్య ఎగశాయి. హాంకాంగ్ 0.4 శాతం క్షీణించగా.. ఇండొనేసియా స్వల్పంగా బలపడింది. చైనా యథాతథంగా కదులుతోంది. -
టెస్లా జోరు- ఇక ఎస్అండ్పీలో చోటు!
టెక్నాలజీ ఆధారిత ఎలక్ట్రిక్ కార్ల అమెరికన్ దిగ్గజం టెస్లా ఇంక్.. ఇటు ఆర్థిక ఫలితాలు, ఆటు షేరు ర్యాలీలోనూ జోరు చూపుతోంది. ఈ ఏడాది(2020) రెండో త్రైమాసికంలో 10.4 కోట్ల డాలర్ల(రూ. 780 కోట్లు) నికర లాభం ఆర్జించింది. తద్వారా వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ లాభాలను సాధించింది. దీంతో ఎస్అండ్పీ-500 ఇండెక్స్‌లో చోటు సాధించేందుకు అర్హత సాధించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. క్యూ2(ఏప్రిల్-జూన్)లో టెస్లా మొత్తం ఆదాయం 6.04 బిలియన్ డాలర్లను తాకింది. కాగా.. బుధవారం 1.5 శాతం బలపడి 1592 డాలర్ల వద్ద ముగిసిన షేరు ఫ్యూచర్స్‌లో మరో 4.5 శాతం ఎగసింది. ఇప్పటికే కంపెనీ మార్కెట్ విలువ 295 బిలియన్ డాలర్లను దాటడంతో ఆటో దిగ్గజం టయోటాను వెనక్కి నెట్టింది. వెరసి మార్కెట్ విలువ రీత్యా ఆటో రంగంలో అత్యంత విలువైన కంపెనీగా టెస్లా నిలుస్తోంది. టెస్లా షేరు 12 నెలల్లో 500 శాతం ర్యాలీ చేయగా.. 2020లో ఇప్పటివరకూ 200 శాతంపైగా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే! కారణాలున్నాయ్ కోవిడ్-19 అనిశ్చితులలోనూ క్యూ2లో టెస్లా ఇంక్ అంచనాలను అధిగమిస్తూ 90,650 వాహనాలను విక్రయించగలిగింది. మోడల్ 3, మోడల్ Y కార్లకు ఏర్పడిన డిమాండ్ ఇందుకు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఈ రెండు మోడళ్ల కార్లను రూపొందించేందుకు తాజాగా టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో 110 కోట్ల డాలర్ల(రూ. 8250 కోట్లు) అసెంబ్లింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ తాజాగా ప్రకటించారు. తద్వారా 5,000 మందివరకూ ఉపాధి లభించనున్నట్లు తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే మూడు ప్లాంట్లను కలిగి ఉంది. ఇటీవల యూఎస్‌లో భారీ ఆసక్తి నెలకొన్న కంపెనీ తయారీ మోడల్ 3 కారు ప్రారంభ ధర 38,000 డాలర్లు(రూ. 28.5 లక్షలు) అంటూ విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. తొలుత దైమ్లర్తో జత 134 ఏళ్ల క్రితమే ఆధునిక కార్ల తయారీని ప్రారంభించిన జర్మన్ దిగ్గజం.. దైమ్లర్ 2009 మే నెలలో టెస్లా ఇంక్‌లో 10 శాతం వాటాను సొంతం చేసుకుంది. తద్వారా టెక్నాలజీ ఆధారిత కార్ల తయారీపై దృష్టితో ప్రారంభమైన స్టార్టప్.. టెస్లా ఇంక్‌కు 5 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. అయితే తదుపరి కాలంలో టెస్లా తయారీ టెక్నాలజీ ఆధారిత కార్లను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడంపై దైమ్లర్ సందేహించినట్లు తెలుస్తోంది. దీంతో 2014 డిసెంబర్లో టెస్లాలో గల 10 శాతం వాటాను దైమ్లర్ విక్రయించింది. అయితే దైమ్లర్తో జట్టుకట్టడం ద్వారా టెస్లా.. కార్ల దీర్ఘకాలిక భద్రత, నియంత్రణ తదితర అంశాలను అవగాహన చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది తదుపరి దశలో కంపెనీకి ఉపయుక్తంగా నిలిచినట్లు అభిప్రాయపడ్డారు. -
మళ్లీ 3000 పాయింట్లకు ఎస్అండ్పీ!
యూఎస్ మార్కెట్లు మంగళవారం మంచి ర్యాలీ జరిపాయి. పలు షేర్లు అప్‌మూవ్ చూపడంతో ఎస్అండ్పీ 500 సూచీ మరలా 3000 పాయింట్లను దాటింది. కరోనావైరస్కు వాక్సిన్ దిశగా ముందడుగులు, యూఎస్ ఎకానమీలో వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడం.. సూచీలకు ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో మార్చి5 తర్వాత తొలిసారి ఎస్అండ్పీ సూచీ కీలక 3000 పాయింట్ల పైకి చేరింది. అయితే చివరలో కాస్త లాభాలస్వీకరణ రావడంతో 2991 పాయింట్ల వద్ద క్లోజయింది. సూచీలోని 11 విభిన్న రంగాల సూచీలు పాజిటివ్‌గా ముగిశాయి. ఈ అప్‌మూవ్‌తో మార్చి కనిష్ఠాల నుంచి సూచీ దాదాపు 36 శాతం లాభపడినట్లయింది. ప్రస్తుతం ఫిబ్రవరి ఆల్‌టైమ్ హైకి కేవలం 13 శాతం దూరంలో ఉంది. ఇతర కీలక సూచీలు డౌజోన్స్, నాస్డాక్ సైతం లాభాల్లో ముగిశాయి. కరోనా వాక్సిన్ ట్రయిల్స్ చేస్తున్నట్లు ప్రకటించిన బయోకంపెనీ నోవావాక్స్ షేర్లు దాదాపు 15 శాతం దూసుకుపోయాయి. అయితే నిరుద్యోగిత పెరగడం, మాంద్య లక్షణాలు ముదరడంతో యూఎస్ ఎకానమీలో రికవరీ అనుకున్నంత వేగంగా ఉండకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
వెలుగులో ఐటీ, ఎఫ్ఎంసీజీ
ఆసియా స్టాక్ మార్కెట్లు పతనమైనా, భారత్ సూచీలు బుధవారం ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్ల మద్దతుతో పాజిటివ్‌గా ముగిశాయి. చైనా వృద్ధి రేటు మందగించిన ప్రభావంతో జపాన్, హాంకాంగ్, సింగపూర్, కొరియా తదితర ఆసియా మార్కెట్లు 1-2 శాతం మధ్య పడిపోయాయి. యూరప్ మార్కెట్లు కూడా క్షీణతతో ట్రేడవుతున్నా, బీఎస్ఈ సెన్సెక్స్ 30 పాయింట్ల పెరుగుదలతో 21,856 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5 పాయింట్లు లాభపడి 6,517 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మన మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాల పట్ల ఆశాభావంతో మార్కెట్ పాజిటివ్‌గా ముగిసిందని బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. తదుపరి వెలువడిన డేటా ప్రకారం మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఫిబ్రవరి నెల ద్రవ్యోల్బణం రేటు 8.1 శాతానికి తగ్గింది. జనవరి నెలలో పారిశ్రామికోత్పత్తి తగ్గొచ్చన్నది మార్కెట్ అంచనా కాగా, ఐఐపీ సూచీ 0.1 శాతం పెరిగింది. లిస్టింగ్‌లోనే శాంకో నీరసం ముంబై: ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ ద్వారా లిస్టయిన పీవీసీ పైపుల తయారీ సంస్థ శాంకో ఇండస్ట్రీస్ తొలి రోజు 4% నష్టపోయింది. ఈ చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ) షేరు రూ. 19 వద్ద లిస్టయ్యింది. ఆపై 4.2% క్షీణించి రూ. 17.25 వద్ద ముగిసింది. హిమాచల్ ప్రదేశ్‌లో యూనిట్ కలిగిన శాంకో ఎన్ఎస్ఈ ఎమర్జ్ ద్వారా లిస్టయిన ఐదో కంపెనీగా నిలిచింది. చిన్న సంస్థలు(ఎస్ఎంఈలు) ఐపీవోలను చేపట్టి నిధులు సమీకరించేందుకు వీలుగా ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్ ఎమర్జ్‌కాగా, శాంకో గత నెల 24న రూ. 18 ధరలో 24 లక్షల షేర్లను విక్రయించింది.