న్యూఢిల్లీ: దివాలా తీసిన గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేయడానికి మూడు సంస్థలు పోటీపడుతున్నాయి. దేశీ విమానయాన సంస్థ స్పైస్‌జెట్, షార్జాకి చెందిన ఏవియేషన్ కంపెనీ స్కై వన్, ఆఫ్రికా కేంద్రంగా పని చేసే సాఫ్రిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ వీటిలో ఉన్నాయి. గో ఫస్ట్ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు స్పైస్‌జెట్ తెలియజేసింది.
మదింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత త్వరలోనే తమ ఆఫర్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు వివరించింది. మదింపు ప్రక్రియను చేపట్టేందుకు గత పది రోజులుగా ఈ మూడు సంస్థల నుంచి దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ) శైలేంద్ర అజ్మీరాకు అభ్యర్ధనలు వచి్చనట్లు తెలుస్తోంది. వాస్తవానికి గో ఫస్ట్ కొనుగోలు కోసం బిడ్లు దాఖలు చేసేందుకు గడువు నవంబర్ 22తో ముగిసింది. అయితే, గడువు లోపల స్పందించని కంపెనీలు.. ఆ తర్వాత ఆసక్తి వ్యక్తం చేయడం గమనార్హం.
తాజా పరిస్థితుల నేపథ్యంలో బిడ్డింగ్ డెడ్‌లైన్‌ను మరికొంత కాలం పొడిగించాలని బిడ్డర్లు కోరినట్లు సమాచారం. దీనిపై రుణదాతల కమిటీ (సీఓసీ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్ మే 3 నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు 270 మిలియన్ డాలర్లను సమీకరించుకునే ప్రయత్నాల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment